మాకు తెలియకుండా ధూళిపాళ్లను జైలుకు ఎలా తరలిస్తారు?: ఏసీబీపై కోర్టు ఆగ్రహం

13-05-2021 Thu 20:41
  • సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల
  • ఇటీవలే కరోనా పాజిటివ్
  • విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స
  • నెగెటివ్ రావడంతో రాజమండ్రి జైలుకు తరలింపు
  • తరలింపుపై ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు
Court questions ACB officials on Dhulipalla issue

ఇటీవల కరోనా బారినపడి విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను ఏసీబీ అధికారులు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం తెలిసిందే. ఆయనను మళ్లీ జైలుకు తరలించడంపై దాఖలైన పిటిషన్ పై ఏసీబీ కోర్టు నేడు విచారణ జరిపింది.

ఈ సందర్భంగా ఏసీబీ అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ధూళిపాళ్ల నరేంద్రను తమకు తెలియకుండా జైలుకు ఎలా తరలిస్తారని ఏసీబీ అధికారులను కోర్టు నిలదీసింది. కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ ధూళిపాళ్లకు వారం రోజుల ఐసోలేషన్ అవసరమని వైద్యులు చెప్పారని, అలాంటప్పుడు జైలుకు ఎందుకు తీసుకెళ్లారని న్యాయమూర్తి ప్రశ్నించారు.

ధూళిపాళ్లను రాజమండ్రి ప్రైవేటు ఆసుపత్రికి గానీ, విజయవాడ ఆయుష్ ఆసుపత్రికి గానీ తరలించాలని ఆదేశించింది. అయితే, విజయవాడ తీసుకెళ్లలేమని ఏసీబీ అధికారులు విన్నవించుకోవడంతో, మరోసారి తమకు తెలియకుండా తరలించవద్దని స్పష్టం చేసింది. తమ అనుమతి తీసుకోవాలని తెలిపింది.

సంగం డెయిరీలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ చైర్మన్ గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రను, డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆయన కస్టడీలో ఉండగానే కరోనా బారినపడ్డారు.