KTR: లాక్ డౌన్ పొడిగింపుపై ఈ నెల 20న క్యాబినెట్ నిర్ణయిస్తుంది: కేటీఆర్

KTR chitchat in social media
  • Ask KTR పేరిట చాటింగ్
  • ట్విట్టర్ లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం
  • నెటిజన్ల ప్రశ్నలకు ఓపిగ్గా బదులిచ్చిన కేటీఆర్
  • 70 శాతం ప్రజలకు వ్యాక్సిన్ ఇస్తే కరోనా కట్టడి జరుగుతుందని ధీమా
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో (Ask KTR)  ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... లాక్ డౌన్ పొడిగింపుపై క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని, ఈ నెల 20న క్యాబినెట్ సమావేశం కానుందని వెల్లడించారు.

ఇతర అంశాలపై చర్చిస్తూ... రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కొరతకు డిమాండ్-సప్లై అంశమే కారణమని అభిప్రాయపడ్డారు. 70 శాతం ప్రజానీకం వ్యాక్సిన్ పొందితే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని తెలిపారు. 2.9 కోట్ల వయోజనుల్లో 1.9 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం రెండు డోసుల వ్యాక్సిన్లు అమల్లో ఉన్నందున ఆ లెక్కన 3.8 కోట్ల డోసులు అవసరం అవుతాయని కేటీఆర్ వివరించారు.

మరో ప్రశ్నకు బదులిస్తూ, అమెరికా వ్యాక్సిన్లకు భారత్ లో అనుమతి లేదని, ఒకవేళ అనుమతి వస్తే తప్పకుండా వాటిని సేకరిస్తామని వెల్లడించారు. రాష్ట్ర జనాభాకు తగినన్ని డోసులు వస్తే మాత్రం 45 రోజుల్లో తెలంగాణలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇస్తామని, ఆ మేరకు సమర్థత, మౌలిక సదుపాయాలు రాష్ట్రానికి ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR
Chitchat
AskKTR
Corona Virus
Vaccine

More Telugu News