వ్యాక్సిన్ల తయారీ ఆలస్యమైతే మేం ఉరి వేసుకోవాలా?: కేంద్ర మంత్రి

13-05-2021 Thu 19:43
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సదానంద గౌడ
  • వ్యాక్సిన్ల కొరతపై కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే వ్యాఖ్యలు 
  • కోర్టుల ఆదేశాల మేరకు టీకాలు అందకపోతే తామేం చేస్తామని ప్రశ్న
  • ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వ్యాఖ్య
Should we hang ourselves if vaccines production get delayed

కరోనా వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఆదేశించినట్లుగా సకాలంలో టీకాలు అందజేయలేకపోతే ప్రభుత్వంలో ఉన్నవారు ఉరివేసుకోవాలా? అని ప్రశ్నించారు.

 ‘‘కోర్టు సదుద్దేశంతో ప్రజలందరికీ టీకా అందించాలని ఆదేశించింది. నేనొక విషయం అడుగుతాను.. ఒకవేళ కోర్టు రేపు ఇంత మొత్తంలో టీకాలు అందజేయాలని కోరిందనుకుందాం. కానీ, అవి ఇంకా ఉత్పత్తి కాలేదు, అప్పుడు మాకు మేం ఉరి వేసుకోవాలా?’’ అని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సదానంద గౌడ వ్యాఖ్యానించారు.

టీకాల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఓ ప్రణాళికతో ముందుకు వెళుతోందని మంత్రి తెలిపారు. అయితే, తమ ప్రణాళికలు ఎలాంటి రాజకీయ స్వప్రయోజనాలు, లేదా ఇతర కారణాలతో ప్రభావితం కావడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తన పని తాను చిత్తశుద్ధితో, నిజాయతీగా చేస్తోందని తెలిపారు. అయితే, ఈ క్రమంలో కొన్ని లోపాలు తలెత్తాయన్నారు. కొన్ని అంశాలు మన పరిధి దాటి వెళ్లిపోతాయని.. వాటిని మనం ఎలా చక్కబెట్టగలం? అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ప్రభుత్వం తన కృషి తాను చేస్తోందన్నారు. రానున్న ఒకటి, రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని.. త్వరలోనే అందరికీ టీకా అందుతుందని తెలిపారు.