అదీ సల్మాన్‌ క్రేజ్‌ అంటే.. 'రాధే' కోసం క్రాష్‌ అయిన సర్వర్లు!

13-05-2021 Thu 18:55
  • ఈరోజు విడుదలైన సల్మాన్‌ ‘రాధే’ చిత్రం
  • ఓటీటీ వేదిక జీ5, జీ5 ప్లస్‌లో విడుదల
  • లక్షలాది మంది ఒకేసారి లాగిన్‌
  • లోడ్‌ ఎక్కువయ్యి క్రాష్‌ అయిన సర్వర్లు
OTT Released in Zee5 servers down

కరోనా పుణ్యమా అని స్టార్‌ హీరోల చిత్రాలు సైతం ఓటీటీలో విడుదల కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటించిన చిత్రం రాధే గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఓటీటీ వేదిక జీ5, జీ5 ప్లస్‌లో విడుదలైంది. అయితే, సల్మాన్‌  నటించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పటి నుంచో వేచిచూస్తున్నారు. దీంతో సినిమా విడుదల సమయం అవగానే అందరూ ఒకేసారి లాగిన్‌ అయ్యారు. దీంతో సర్వర్లన్నీ ఒక్కసారిగా స్తంభించిపోయాయి.

ఈ విషయాన్ని జీ5 వారు పరోక్షంగా ట్విటర్‌ వేదికగా ధ్రువీకరించారు. సమస్యను పరిష్కరించి త్వరలోనే మీ ముందుకు వస్తామని వెల్లడించారు. అయితే, అందరికీ ఈ సమస్య తలెత్తలేదని సమాచారం. కొందరు మాత్రం చిత్రాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా చూసేశారు. మరికొంత మందికి ఇప్పటికీ సినిమా అందకపోవడం గమనార్హం. దిశ పటానీ హీరోయిన్‌గా నటించిన ఈ భారీ యాక్షన్‌ చిత్రానికి ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌, డైరెక్టర్‌ ప్రభుదేవా దర్శకత్వం వహించారు.