కరోనా ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా

13-05-2021 Thu 17:53
  • మే 31తో ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ
  • జూన్ 3న తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ
  • దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతం
  • ఈ పరిస్థితుల్లో ఎన్నికలు కష్టమన్న ఈసీ
  • కరోనా తగ్గాక ఎన్నికలుంటాయని వెల్లడి
EC postpones MLA quota MLC elections in AP and Telangana due to corona second wave

కరోనా పరిస్థితుల్లోనూ ఇటీవల వరకు దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికలు జరగడం తెలిసిందే. అయితే కరోనా సెకండ్ వేవ్ మహోగ్రరూపం దాల్చిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించాల్సిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేసింది. మే 31తో ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీలకు, జూన్ 3తో తెలంగాణలోని ఆరుగురు ఎమ్మెల్సీలకు పదవీకాలం ముగియనుంది.

దాంతో ఆయా స్థానాలు ఖాళీ కానున్నాయి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా పరిస్థితులు కుదుటపడిన తర్వాతే ఎన్నికల నిర్వహణ ఉంటుందని స్పష్టం చేసింది.