వచ్చేవారం నుంచి భారత్ మార్కెట్లలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్

13-05-2021 Thu 17:14
  • భారత్ లో ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్ పంపిణీ
  • స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కు భారత్ లో అనుమతులు
  • ఇప్పటికే 1.5 లక్షల డోసులు హైదరాబాద్ చేరిక
  • ఈ నెలాఖరుకు 30 లక్షల డోసులు రాక
  • జులై నుంచి భారత్ లోనే స్పుత్నిక్ వి ఉత్పత్తి
Sputnik V will be available in India from next week

కరోనా నివారణకు రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వి'. దీనిని వచ్చే వారం నుంచి భారత్ లో అందుబాటులోకి తెస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు మాత్రమే పంపిణీ చేస్తుండగా, ఇకపై మూడో వ్యాక్సిన్ కూడా రానుండడంతో వ్యాక్సిన్ కష్టాలు కొద్దిమేర తీరతాయని భావిస్తున్నారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డోసులు వచ్చే వారం నుంచి భారత మార్కెట్లలో లభ్యమవుతాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

ప్రస్తుతానికి స్పుత్నిక్ వి డోసులను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, జులై నుంచి భారత్ లోనే ఈ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తామని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్లను హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఉత్పత్తి చేయనుంది. కాగా, ఈ నెలాఖరుకు 30 లక్షల స్పుత్నిక్ వి డోసులు భారత్ చేరుకోనున్నాయి. మరోపక్క, ఇటీవల 1.5 లక్షల స్పుత్నిక్ వి డోసులు హైదరాబాదు చేరుకున్న విషయం విదితమే. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను రష్యాకు చెందిన గమలేయా నేషనల్ సెంటర్ అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే అధికారికంగా ఆమోదం పొందిన తొలి కరోనా వ్యాక్సిన్ ఇదే.