వెంకటేశ్ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం?

13-05-2021 Thu 16:42
  • విడుదలకు సిద్ధంగా 'నారప్ప', 'దృశ్యం 2'
  • అనిల్ రావిపూడితో చేస్తున్న 'ఎఫ్ 3'
  • తర్వాత వచ్చేది వెంకీ 75వ సినిమా
  • త్రివిక్రమ్ తో ఇప్పటికే జరిగిన చర్చలు
Trivikram to direct Venkatesh

తమ కెరీర్లో మైలురాళ్లు అనబడే సినిమాలను గ్రాండ్ గా ప్లాన్ చేసుకోవడం మన హీరోలకు అలవాటు. అందుకోసం డిమాండులో వున్న డైరెక్టర్ తో మంచి కాంబినేషన్ ను సెట్ చేసుకుంటూ వుంటారు. ఇక హీరోయిన్.. వంటి మిగతా హంగులు సరేసరి! ఇప్పుడు ప్రముఖ నటుడు వెంకటేశ్ కూడా తన 75వ చిత్రాన్ని అలాగే గ్రాండ్ గా వుండేలా ప్లానింగ్ చేస్తున్నారు.

తాజాగా ఆయన నటించిన 'నారప్ప', 'దృశ్యం 2' చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంటూ విడుదలకు రెడీ అవుతున్నాయి. కరోనా తగ్గి పరిస్థితులు మామూలు స్థితికి వస్తే వీటిని థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోపక్క, అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 3' చిత్రాన్ని చేస్తున్నారు. దీని తర్వాత వచ్చే 75వ సినిమాకి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంలో వీరి మధ్య ఇప్పటికే చర్చలు కూడా జరిగినట్టు చెబుతున్నారు.

మహేశ్ బాబుతో త్రివిక్రమ్ త్వరలో ఓ సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇది పూర్తయ్యాక వెంకటేశ్ తో ఆయన ప్రాజక్టు ఉంటుందని సమాచారం.