Team India: మోసం చేసి గెలిచారు: టీమిండియాపై ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ విచిత్ర వ్యాఖ్యలు

  • గత ఏడాది జరిగిన టెస్ట్ సిరీస్ ను గెలిచిన భారత్
  • నాలుగో టెస్టును గబ్బాలో ఆడబోమని చెప్పిన టీమిండియా, ఆ తర్వాత అక్కడే ఆడిందన్న పైన్
  • భారత్ చేసిన పనికి ఆటపై మేము దృష్టి సారించలేకపోయామని వ్యాఖ్య
Team India deceived us says Australia Test Captain Tim Paine

గత ఏడాది ఆస్ట్రేలియాలో జరగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ముగిసి దాదాపు ఆరు నెలలు కావొస్తోంది. అయితే, టీమిండియా గెలుపుపై ఆసీస్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తమ దృష్టిని మళ్లించి, మోసపూరితంగా ఇండియా గెలిచిందని అన్నాడు.

మూడో టెస్టు ముగిసిన తర్వాత గబ్బాకు వెళ్లబోమని టీమిండియా చెప్పిందని... దీంతో, నాలుగో టెస్టును ఎక్కడ నిర్వహించాలనే ఆలోచనలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆలోచనలో పడిందని చెప్పాడు. అయితే, ఆ తర్వాత ఏమైందో కానీ గబ్బాలో ఆడతామని ఇండియా చెప్పిందని... ఆ విధంగా ఆస్ట్రేలియా జట్టు ఏకాగ్రతను దెబ్బతీసిందని అన్నాడు.

ఇండియా చేసిన పనికి తాము ఆటపై సరిగా దృష్టి పెట్టలేకపోయామని టిమ్ పైన్ చెప్పాడు. మోసం చేసిన టీమిండియా ఆ మ్యాచ్ తో పాటు, సిరీస్ నే ఎగరేసుకుపోయిందని తెలిపాడు. తమను టీమిండియా తప్పుదోవ పట్టించిన విధానం సూపర్ గా ఉందని ఎద్దేవా చేశాడు. అయితే పైన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భారత అభిమానులు విరుచుకుపడుతున్నారు. సిరీస్ ముగిసిన వెంటనే ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు. మీరు చేసే మోసంతో పోలిస్తే మేమెంత? అని మండిపడుతున్నారు.

More Telugu News