I Dream Media: టీఎన్నార్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం అందించిన ఐ డ్రీమ్ మీడియా

I Dream Media helps TNR family members
  • ఇటీవల కరోనా చికిత్స పొందుతూ మృతి చెందిన టీఎన్నార్
  • గతంలో ఐ డ్రీమ్ సంస్థకు అనేక ఇంటర్వ్యూలు చేసిన వైనం
  • టీఎన్నార్ మృతికి ఐ డ్రీమ్ చైర్మన్ తీవ్ర విచారం
  • టీఎన్నార్ కుటుంబ సభ్యులకు పరామర్శ
దర్శకుడు అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి సినీ పాత్రికేయుడిగా, వ్యాఖ్యాతగా, నటుడిగా రాణిస్తున్న టీఎన్నార్ ఇటీవల కరోనాతో కన్నుమూయడం చిత్ర పరిశ్రమలోనూ, యూట్యూబ్ వర్గాల్లోనూ విషాదాన్ని నింపింది. టీఎన్నార్ గతంలో ఐ డ్రీమ్ యూట్యూబ్ చానల్ కోసం అనేకమంది సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేశారు. ఐ డ్రీమ్ పాప్యులారిటీ పెంచడంలో తనవంతు శ్రమించారు. తమ సంస్థ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన టీఎన్నార్ ఇప్పుడు తమ మధ్య లేకపోవడం పట్ల ఐ డ్రీమ్ మీడియా సంస్థ చైర్మన్ చిన్న వాసుదేవ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఆయన టీఎన్నార్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.10 లక్షల చెక్ ను టీఎన్నార్ కుటుంబ సభ్యులకు అందజేశారు. టీఎన్నార్ పిల్లలను చదివించే బాధ్యతను కూడా తాను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. టీఎన్ఆర్ ఐ డ్రీమ్ సంస్థలో ఉద్యోగి మాత్రమే కాదని, తనకు సన్నిహితుడు అని వాసుదేవరెడ్డి తెలిపారు. సంస్థ ఎదుగుదలకు విలువైన సూచనలు, సలహాలు అందించాడని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటామని స్పష్టం చేశారు.

కాగా, టీఎన్నార్ పిల్లలకు, ఇతర కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకిందని, వారికి అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యుడి పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని, వారి ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని వాసుదేవరెడ్డి వెల్లడించారు.
I Dream Media
Chinna Vasudeva Reddy
TNR
Help
Corona Virus

More Telugu News