Maharashtra: అజిత్​ పవార్​ సోషల్​ మీడియా నిర్వహణకు రూ.6 కోట్లు కేటాయించిన 'మహా' సర్కార్​

  • ప్రత్యేక ఏజెన్సీ ద్వారా ఉప ముఖ్యమంత్రి ఖాతాల నిర్వహణ
  • సమాచార శాఖకు ఆ నైపుణ్యాలు లేవని పేర్కొంటూ ఉత్తర్వులు
  • మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడిన బీజేపీ
  • ఒక్క మంత్రికే అంత ఖర్చు చేస్తారా? అని నిలదీత
Maha Govt allocates Rs 6 crore for Ajit Pawar Social Media Management

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి అజిత్ పవార్ సామాజిక మాధ్యమాల నిర్వహణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏజెన్సీని నియమించింది. అందుకోసం రూ.6 కోట్ల నిధులనూ కేటాయించింది. ఆయన తీసుకునే నిర్ణయాలు సామాన్య ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఆర్ఎన్ మూసలే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం 2021–2022కు గానూ అజిత్ పవార్ సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించేందుకు ఏజెన్సీని నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లను సదరు ఏజెన్సీనే చూసుకుంటుందని తెలిపారు. వాట్సాప్, టెలీగ్రామ్, ఎస్ఎంఎస్ లకు సంబంధించిన వ్యవహారాలనూ పర్యవేక్షిస్తుందన్నారు.

వాస్తవానికి ప్రభుత్వంలోని పెద్దల సామాజిక మాధ్యమాల నిర్వహణ కోసం ఇప్పటికే డీజీఐపీఆర్ శాఖ ఉంది. ఆ శాఖ కోసం రూ.150 కోట్లూ ఖర్చు చేస్తోంది. దాదాపు 1,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ, అందులో పనిచేసే వారికి సరైన నైపుణ్యాలు లేవని, సాంకేతిక పరిజ్ఞానం కూడా అంతంత మాత్రమేనని పేర్కొంటూ కొత్త ఉత్తర్వులను ఇచ్చింది.

ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కరోనా మహమ్మారి బారిన పడి జనాలు చచ్చిపోతుంటే.. ఉపముఖ్యమంత్రి సోషల్ మీడియా వ్యవహారాలు చూసేందుకు ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేస్తారా? అని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ ప్రశ్నించారు.

వ్యాక్సిన్లను కొనేందుకు డబ్బుల్లేవని చెప్పే సర్కార్.. ఇప్పుడు అజిత్ పవార్ సోషల్ మీడియా నిర్వహణకు డబ్బెలా ఖర్చు చేస్తోందని మండిపడ్డారు. ఒక్క మంత్రి సోషల్ మీడియాను చూసేందుకే 6 కోట్లు పెడితే.. మిగతా మంత్రులందరికీ ఇంకెంత ఖర్చు పెడతారోనని ఆయన ఎద్దేవా చేశారు. మంత్రులు తమ జేబుల్లో నుంచే అందుకు ఖర్చు పెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News