'స్పుత్నిక్​' టీకాపై విమర్శలు.. రష్యా శాస్త్రవేత్తల స్పందన!

13-05-2021 Thu 13:47
  • టీకా సురక్షితమని ప్రకటన
  • అన్ని ప్రమాణాలతో ట్రయల్స్
  • శాస్త్రవేత్తల సందేహాల నివృత్తి
  • అవకతవకలు జరిగాయన్న 5 దేశాల శాస్త్రవేత్తలు  
Sputnik V Scientists Clarify the Concerns Raised by 5 nation Scientists

రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి క్లినికల్ ట్రయల్స్ లో అవకతవకలు జరిగాయన్న వివిధ దేశాల శాస్త్రవేత్తల ఆరోపణలకు ఆ వ్యాక్సిన్ ట్రయల్స్ చేసిన శాస్త్రవేత్తలు కౌంటర్ ఇచ్చారు. వారి ఆరోపణల్లో వాస్తవం లేదని వివరణ ఇచ్చారు. అన్ని ప్రమాణాలనూ పాటిస్తూ పారదర్శకంగానే టీకాల ట్రయల్స్ నిర్వహించామని స్పష్టం చేశారు.

ఇవీ అమెరికా సహా వివిధ దేశాల ఆరోపణలు

స్పుత్నిక్ టీకా ఫేజ్ 3 ట్రయల్స్ లో లోపాలున్నాయని, ట్రయల్ ప్రొటోకాల్స్, కచ్చితత్వం, డేటా నాణ్యతలో అవకతవకలున్నాయని పేర్కొంటూ లాన్సెట్ జర్నల్ లో అమెరికా, నెదర్లాండ్స్, ఇటలీ, ఫ్రాన్స్ తో పాటు కొందరు రష్యా శాస్త్రవేత్తలు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఫేజ్ 1/2 దశల ట్రయల్స్ సమాచారంలోనూ సమస్యలున్నాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ లో వెల్లడించిన టీకా సామర్థ్యాన్ని మార్చి చూపించారని ఆందోళన వ్యక్తం చేశారు.

సాధారణంగా మొదటి డోసు పూర్తయిన తర్వాత వ్యాక్సిన్ పనితీరుపై విశ్లేషణ చేసి దాని సామర్థ్యాన్ని వెల్లడిస్తారని, కానీ, రెండో డోసు తర్వాతే స్పుత్నిక్ వ్యాక్సిన్ సమర్థతను వెల్లడించారని పేర్కొన్నారు. రెండు డోసుల తర్వాత దాని సామర్థ్యం 91.6% ఉంటుందని చెప్పారన్నారు. అయితే, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది మాత్రం రష్యా బహిర్గతం చేయలేదన్నారు.

ట్రయల్స్ లో పాల్గొన్న కరోనా రోగుల వివరాలనూ సరైన పద్ధతిలో నమోదు చేయలేదని పేర్కొన్నారు. వలంటీర్ల నమోదు, ఎంపికపైనా సరైన పద్ధతులు పాటించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రయల్స్ లో భాగంగా 10 నుంచి 20 రోజుల మధ్య వ్యాక్సిన్ వేసిన వారి సంఖ్యలోనూ తేడాలున్నాయని చెప్పారు. ట్రయల్స్ డేటాను అందరికీ ఇవ్వడంపై ఆంక్షలు విధించడం వల్ల వ్యాక్సిన్ పరిశోధనపై అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.

ఇదీ స్పుత్నిక్ శాస్త్రవేత్తల సమాధానం..

ట్రయల్స్ పద్ధతుల్లో (ప్రొటోకాల్ ) మార్పులను నవంబర్ లోనే చేశామని, దానికి సంబంధించిన పత్రాలనూ లాన్సెట్ కు సమర్పించామని స్పుత్నిక్ అభివృద్ధి, ట్రయల్స్ లో పాల్గొన్న శాస్త్రవేత్తలు చెప్పారు. రెండు డోసులూ తీసుకున్న కరోనా పేషెంట్లు, ఇతర వలంటీర్లపై వ్యాక్సిన్ పనితీరు ఆధారంగానే దాని సామర్థ్యాన్ని ప్రకటించామన్నారు. ఇతర అధ్యయనాల మాదిరిగానే తామూ చేశామన్నారు.

వ్యాక్సిన్  ట్రయల్స్ కు సంబంధించి డయాగ్నస్టిక్ ప్రొటోకాల్, టెస్టింగ్ ప్రమాణాల డేటా పూర్తిగా అందుబాటులో ఉందన్నారు. ట్రయల్స్ ఒరిజినల్ ఆర్టికల్ లో ఆ సమాచారమంతా ఉందని స్పష్టం చేశారు. ఇక, టైపింగ్ తప్పిదాల వల్ల ట్రయల్స్ లో పాల్గొన్న వలంటీర్ల లెక్కల్లో తేడాలొచ్చాయని, అందుకే ఆ తర్వాత వాటిని సరి చేశామని తెలియజేశారు.

అర్జెంటీనా సహా పలు దేశాల్లో నిర్వహించిన అనేక అధ్యయనాల్లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సురక్షితమని తేలిందని, కరోనా నుంచి వ్యాక్సిన్ కాపాడుతోందని పేర్కొన్నారు. 51 దేశాల్లో స్పుత్నిక్ టీకాలు వాడుతున్నారని, అక్కడి ఫలితాల ఆధారంగా చెబుతున్న విషయమిదని చెప్పారు.