దేశంలోనే తొలిసారి.. హైదరాబాద్ ‘గాంధీ’లో కొవిడ్ నుంచి కోలుకున్న 110 ఏళ్ల వృద్ధుడు!

13-05-2021 Thu 10:13
  • కీసరగుట్టలోని ఓ ఆశ్రమంలో ఉంటున్న రామానంద తీర్థ
  • కోలుకున్నా వైద్యుల పర్యవేక్షణలోనే
  • బెంగళూరులో కొవిడ్ నుంచి కోలుకున్నస్వాతంత్య్ర సమరయోధుడు
 first time in the country 110 year old man recovered from covid

కరోనా సెకండ్ వేవ్ జనాన్ని భయపెడుతున్న వేళ దాని బారినపడిన శతాధిక వృద్ధులు మహమ్మారితో పోరాడి విజయం సాధించారు. హైదరాబాద్‌లోని కీసరగుట్టలోని ఓ ఆశ్రమంలో ఉంటున్న 110 ఏళ్ల రామానంద తీర్థ ఇటీవల కరోనా బారినపడ్డారు. దీంతో ఆయనను గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. వృద్ధాప్యం కారణంగా ఆయన తన వివరాలను కూడా సరిగా చెప్పలేకపోతున్నారు.

ఆశ్రమ నిర్వాహకుల వద్ద కూడా ఆయనకు సంబంధించిన వివరాలు లేవు. కాగా, 18 రోజుల చికిత్స అనంతరం రామానంద తీర్థ పూర్తిగా కోలుకున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు తెలిపారు. కరోనా నుంచి ఆయన కోలుకున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగయ్యేంత వరకు ఆసుపత్రిలోనే ఉంచి పర్యవేక్షించనున్నట్టు చెప్పారు.

అలాగే, బెంగళూరుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు హెచ్ఎస్ దొరస్వామి కూడా కరోనా బారినపడి కోలుకున్నారు. ఆయన వయసు 104 సంవత్సరాలు. చికిత్స సమయంలో ఆయన ఆత్మవిశ్వాసంతో కనిపించారని, అందుకే ఔషధాలు పనిచేశాయని వైద్యులు వివరించారు. నిన్న నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.