టీకాలను అడుక్కోవడమేంటి జగన్ గారూ.. పూనావాలా, కృష్ణ ఎల్లాను ఎత్తుకొచ్చి కేసులు పెడితే సరి: అయ్యన్న ఎద్దేవా

13-05-2021 Thu 09:25
  • సంగం డెయిరీని స్వాధీనం చేసుకున్నట్టే చేయండి
  • సీఐడీ ఆఫీసులో రోజుకు తొమ్మిది గంటలు కూర్చోబెడితే వారే దారికొస్తారు
  • టీకాలు  ఇవ్వడం లేదని కడప, కర్నూలులో కేసులు పెట్టించండి
File cases against Krishna yella and Poonawalla told ayyanna patrudu

భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లాతో చంద్రబాబు మాట్లాడి రాష్ట్రానికి వ్యాక్సిన్లు ఇప్పించాలన్న ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశారు. టీకాల గురించి వారిని అడుక్కోవడమేంటని, వారిని లాక్కొచ్చి సీఐడీ ఆఫీసులో రోజుకు తొమ్మిది గంటలు కూర్చోబెడితే మొత్తం కంపెనీలనే రాసిచ్చేయరూ.. అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

మన ఏసీబీ, సీఐడీని పంపి సంగం డెయిరీని స్వాధీనం చేసుకుని అమూల్‌కు అప్పజెప్పినట్టే భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్‌లను స్వాధీనం చేసుకోవడం కుదరదంటారా, జగన్ గారూ? అని అయ్యన్న ప్రశ్నించారు. మన ఏసీబీ, సీఐడీలను పంపించి కృష్ణా ఎల్లా, పూనావాలను ఎత్తుకు రాలేరా? అని ఎద్దేవా చేశారు.

ఉత్తరం రాసినా వ్యాక్సిన్లు ఇవ్వడం లేదంటూ ఆ రెండు సంస్థల యజమానులపైనా కర్నూలు, కడప పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టించి వారిని పట్టుకు రావొచ్చు కదా? అని సలహా ఇచ్చారు. వారిని తీసుకొచ్చి సీఐడీ ఆఫీసులో రోజుకు 9 గంటలు కూర్చోబెడితే వారే తమ కంపెనీలను రాసిచ్చి వెళ్లిపోతారని, టీకాల గురించి వారిని అడుక్కోవడమేంటని అయ్యన్న వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.