Kadapa District: పదిమందిని బలితీసుకున్న మామిళ్లపల్లి క్వారీ రద్దుకు సిఫారసు

  • కలసపాడు క్వారీ వద్ద పేలుడు ఘటనపై విచారణ
  • ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ జరిపిన జేసీ
  • అసలు లీజు దారుడైన వైసీపీ ఎమ్మెల్సీని ఎందుకు అరెస్ట్ చేయలేదన్న టీడీపీ
  • కోర్టుకు వెళ్తామని హెచ్చరిక
Recommendation to cancel Mamillapalli quarry which claimed ten lives

కడప జిల్లా కలసపాడు మండలంలోని మామిళ్లపల్లి క్వారీ రద్దు కోసం ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ గౌతమి తెలిపారు. ఇటీవల ఈ క్వారీ వద్ద జరిగిన పేలుడులో 10 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు.  ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రభుత్వం జేసీ సారథ్యంలో నియమించిన కమిటీ రంగంలోకి దిగింది. నిన్న ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన కమిటీ విచారణ చేపట్టింది.

అనంతరం జేసీ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని క్వారీలను పరిశీలిస్తామన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఉంటే రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. మామిళ్లపల్లి క్వారీ నిర్వాహకులు నాగేశ్వరరెడ్డి, రఘునాథరెడ్డి, వైఎస్ ప్రతాపరెడ్డిలను ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు చెప్పారు. పేలుడుకు బాధ్యులైన వారిపైన, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

కాగా, మామిళ్లపల్లి క్వారీ అసలు లీజుదారైన వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యను ఎందుకు అరెస్ట్ చేయలేదని టీడీపీ ప్రశ్నించింది. సబ్ లీజు తీసుకున్న వారిని అరెస్ట్ చేసి, అసలు లీజు దారుడిని ఎందుకు వదిలేశారని నిలదీసింది. ఈ విషయంలో ప్రభుత్వం కనుక స్పందించకుంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరించింది.

More Telugu News