విజయవాడ రైల్వే ఆసుపత్రిలో రీఫిల్లింగ్ చేస్తుండగా ఆక్సిజన్ లీక్.. గాల్లో కలిసిన వెయ్యి కిలోలీటర్లు!

13-05-2021 Thu 06:36
  • ఫణి గ్రీష్మ ఏజెన్సీ నుంచి ట్యాంకర్‌లో ఆక్సిజన్
  • దట్టంగా కమ్ముకున్న పొగతో జనం పరుగులు
  • ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు ఉండడంతో తప్పిన ముప్పు
Oxgen leakage at vijayawada railway hospital

ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న వేళ విజయవాడ రైల్వే ఆసుపత్రిలో వెయ్యి కిలోలీటర్లకు పైగా ఆక్సిజన్ వృథా అయింది. ఆటోనగర్‌లో ఉన్న ఫణి గ్రీష్మ ఏజెన్సీ నుంచి రైల్వే ఆసుపత్రికి ప్రతి రోజూ వెయ్యి కిలోలీటర్ల ఆక్సిజన్ సరఫరా అవుతుంటుంది. నిన్న కూడా ఓ ట్యాంకర్ ఆక్సిజన్ మోసుకొచ్చింది.

ట్యాంకర్‌లోని ఆక్సిజన్‌ను ఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు లీకైంది. దీంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం తెల్లని పొగలా ఆక్సిజన్ దట్టంగా కమ్మేసింది. దీంతో ఏం జరుగుతోందో తెలియని ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆక్సిజన్ లీకైనప్పటికీ ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు, కాన్సంట్రేటర్లు ఉండడంతో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఘటనపై డివిజనల్ రైల్వే మేనేజర్ విచారణకు ఆదేశించారు.