కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం ఎక్కడో గాడి తప్పింది: అనుపమ్‌ ఖేర్‌

12-05-2021 Wed 21:29
  • ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలకు సమర్థింపు
  • ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలని హితవు
  • తేలుతున్న శవాలపై రాజకీయాలొద్దని కాంగ్రెస్‌కు చురక
  • ఎన్‌డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు 
in a rare move anupam care criticises bjp govt

ప్రధాని మోదీ, కేంద్రం ప్రభుత్వంపై నిత్యం ప్రశంసలు కురిపించే ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ అనూహ్యంగా ఈసారి విమర్శలు ఎక్కుపెట్టారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం ఎక్కడో గాడి తప్పిందన్నారు. మహమ్మారిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలను ఆయన సమర్థించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజలు అప్పగించిన బాధ్యతను చక్కబెట్టాలని హితవు పలికారు. ఇప్పటి వరకు జరిగిన నష్టానికి ప్రభుత్వానిదే బాధ్యత అని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీకి కూడా అనుపమ్‌ ఖేర్‌ పరోక్షంగా చురకలంటించారు. శవాలు నీటిలో తేలడం చూసి మానవత్వం లేని వారు మాత్రమే చలించరని వ్యాఖ్యానించారు. పరోక్షంగా బిహార్‌లో గంగా నదిలో కొట్టుకొచ్చిన శవాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి అంశాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకోకూడదని సూచించారు. ప్రస్తుతం అనుపమ్‌ ఖేర్‌ భార్య  కిరణ్‌ ఖేర్‌ బీజేపీ ఎంపీగా ఉండడం గమనార్హం.