బుమ్రా ప్రదర్శనే భారత జట్టు విజయానికి కీలకం: సాబా కరీం

12-05-2021 Wed 20:24
  • టెస్టు ఛాంపియన్ షిప్‌ విజయానికి బుమ్రా కీలకం
  • ప్రస్తుతం ఉన్న ఫాస్ట్‌ బౌలర్లలో బుమ్రానే బెస్ట్‌
  • మూడేళ్లలో ఉన్నతస్థాయికి ఎదిగిన ఆటగాడు
  • అంతర్జాతీయ క్రికెట్లో పెరుగుతున్న బుమ్రా ఆధిపత్యం
  • బుమ్రాపై మాజీ వికెట్‌ కీపర్‌ కరీం మనోగతం
Bumrah is key to indias victory in test championship saba karim

భారత క్రికెట్‌ జట్టు మాజీ వికెట్‌ కీపర్‌, సెలెక్టర్‌ సాబా కరీం.. పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. రాబోయే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత్‌ విజయం సాధించాలంటే బుమ్రా ప్రదర్శన చాలా కీలకమని తెలిపారు. అతను టెస్టు క్రికెట్‌లోకి వచ్చి మూడేళ్లే అయినా కీలక బౌలర్‌గా ఎదిగాడని తెలిపారు. 19 మ్యాచుల్లో 22.10 సగటుతో 83 వికెట్లు తీసి ప్రస్తుతం మేటి బౌలర్‌గా ఉన్నాడని కొనియాడారు. ఈ నేపథ్యంలోనే రాబోయే టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు విజయం అతడి ప్రదర్శనపై ఆధారపడి ఉందన్నారు.

ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఫాస్టు బౌలర్లలో బుమ్రాదే మెరుగైన బౌలింగ్‌ అని కరీం అభిప్రాయపడ్డారు. అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతున్న క్రికెటర్‌ అని.. సహజంగానే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలన్న ఒత్తిడి అతడిపై ఉంటుందని అన్నారు. టెస్టు క్రికెట్‌లో బుమ్రా ప్రదర్శన ఎప్పుడూ ఉత్తమంగానే ఉందన్నారు. క్రమంగా అంతర్జాతీయ క్రికెట్లో అతడి ఆధిపత్యం పెరుగుతోందన్నారు.