వ్యాక్సిన్లను తక్షణ అవసరం ఉన్న దేశాలకు పంపాలి: వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సులో పీయుష్‌ గోయల్‌

12-05-2021 Wed 19:18
  • వైద్య సామగ్రిని ఇతర దేశాలకు పంపాలని విజ్ఞప్తి
  • ప్రపంచానికి భారత్‌ 67 మిలియన్ల డోసులు పంపింది
  • భారత్‌లో టీకాల ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే పేద దేశాలకు పంపుతామని హామీ
Vaccins must be shared with those who are in dire need piyush goyal

కొవిడ్‌ సంబంధిత సామగ్రి ఎగుమతికి అన్ని దేశాలు సహకరించాలని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ కోరారు. అలాగే వ్యాక్సిన్లను సైతం తక్షణ అవసరమున్న దేశాలకు పంపాలన్నారు. ‘వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం’ నిర్వహించిన ‘గ్లోబల్‌ ట్రేడ్‌ ఔట్‌లుక్‌ సెషన్‌’లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీలైనంత వేగంగా వ్యాక్సిన్లు, ఔషధాలు, ఇతర వైద్య సరఫరాలను అందజేయాలని గోయల్‌ కోరారు. తద్వారా అవి కావాల్సిన వారందరికీ సరైన సమయంలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రపంచానికి భారత్‌ 67 మిలియన్ల టీకా డోసులు అందించిందని గోయల్‌ గుర్తుచేశారు. భారత్‌లో టీకాల ఉత్పత్తి సామర్థ్యం పెరిగి, వాటి పంపిణీ ప్రారంభమైన తర్వాత పేద దేశాలకు అందించడానికి సిద్ధంగా ఉన్నామని గోయల్‌ తెలిపారు.