రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నేత ధూళిపాళ్ల తరలింపు

12-05-2021 Wed 16:28
  • ఇటీవల కరోనా బారిన పడిన ధూళిపాళ్ల
  • విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స
  • కరోనా నుంచి కోలుకోవడంతో జైలుకు తరలింపు
Dhulipala Narendra shifted to central jail

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ పోలీసులు మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ధూళిపాళ్లను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయగా, కోర్టు రిమాండుకు పంపిన సంగతి తెలిసిందే.

అయితే జైల్లో ఆయనకు కరోనా సోకడంతో విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించారు. కరోనా నుంచి కోలుకున్న ఆయనకు తాజా పరీక్షలో నెగెటివ్ వచ్చింది. దీంతో ఆయనను మళ్లీ జైలుకు తరలించారు. అయితే, వైద్యుల సూచన మేరకు వారం పాటు ఆయనను ఐసొలేషన్ లో ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు. మరోవైపు ధూళిపాళ్లకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. నరేంద్ర కస్టడీని రీకాల్ చేయాలని పిటిషన్ లో కోరారు.