Anil Kumar Yadav: నేను, మేకపాటి ఈ మధ్యనే కరోనా నుంచి కోలుకున్నాం: మంత్రి అనిల్ కుమార్ యాదవ్

Recently I recovered from Corona says Anil Kumar Yadav
  • ఆక్సిజన్, బెడ్ల కొరత వున్నాయంటూ విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయి
  • ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది
  • పదేళ్లు తనతో ఉన్న కార్యకర్తను కాపాడుకోలేకపోయానన్న మంత్రి  
నెల్లూరు జిల్లాలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్, బెడ్ల కొరత వున్నాయంటూ విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ లో అమ్ముతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ప్రతిపక్ష నేతలు ఇంట్లో కూర్చొని మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. తాను, మేకపాటి గౌతమ్ రెడ్డి కరోనా నుంచి ఇటీవలే కోలుకున్నామని చెప్పారు. ఈరోజు నెల్లూరులోని కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి మంత్రులిద్దరూ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని... ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనిల్ అన్నారు. 10 ఏళ్లు తనతో ఉన్న కార్యకర్త కరోనాతో చనిపోయాడని... అతన్ని కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో జనాలు భయపడుతుంటే... వారిని విపక్ష నేతలు మరింత భయపెడుతున్నారని మండిపడ్డారు. వీలైతే ధైర్యం చెప్పాలి గానీ... మాటలతో భయపెట్టి చంపకూడదని అన్నారు.
Anil Kumar Yadav
YSRCP

More Telugu News