తిరుపతి ఆసుపత్రిలో చనిపోయింది 11 మంది కాదు.. వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు చెపుతోంది: సీపీఐ నారాయణ

12-05-2021 Wed 15:23
  • రుయా ఆసుపత్రిలో 23 మంది చనిపోయారు
  • మృతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం  అసత్యాలు చెపుతోంది
  • ఆక్సిజన్ విషయంలో కేంద్రాన్ని జగన్ నిలదీయలేకపోతున్నారు
CPI Narayana fires on Jagan

తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక పలువురు కరోనా పేషెంట్లు చనిపోయిన సంగతి తెలిసిందే. మొత్తం 11 మంది చనిపోయినట్టు ప్రభుత్వం చెపుతోంది. అయితే ఈ లెక్కలు కరెక్ట్ కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మృతుల విషయంలో ప్రభుత్వం అసత్యాలు చెపుతోందని విమర్శించారు. మొత్తం 23 మంది చనిపోయారని అన్నారు.

అంతేకాదు చనిపోయిన వారి పేర్లను కూడా ఆయన వెల్లడించారు. రమేశ్ బాబు, రామారావు, జయచంద్ర, కె.బాలు, భువనేశ్వర్ బాబు, రమణాచారి, కలందర్, గజేంద్రబాబు, షాహిద్, మహేంద్ర, ప్రభాకర్, పుష్పలత, గౌడ్ బాషా, వేణుగోపాల్, మదన్మోహన్ రెడ్డి, దేవేంద్రరెడ్డి, రాజమ్మ, సుబ్రహ్మణ్యం, సులోచన, తనూజారాణి, వెంకట సుబ్బయ్య, పజులాల్, రామారావు అనే వ్యక్తులు చనిపోయారని ఆయన చెప్పారు.

మృతుల సంఖ్యపై వైసీపీ ప్రభుత్వం వాస్తవాలను చెప్పడం లేదని నారాయణ మండిపడ్డారు. ఆక్సిజన్ ట్యాంకర్లను రెండ్రోజుల ముందే తెప్పించుకోవాలనే విషయం ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. ఆక్సిజన్ ఇవ్వాల్సిన విషయంలో కేంద్రాన్ని జగన్ ఎందుకు నిలదీయలేకపోతున్నారని ప్రశ్నించారు. వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీలకు కూడా వైసీపీ నేతలు కులాలను ఆపాదిస్తున్నారని చెప్పారు. కేంద్రాన్ని నిలదీయడం చేతకాక... ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేస్తారా? అని మండిపడ్డారు. వైసీపీ నేతల కల్యాణమండపాలను కోవిడ్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు.