జగన్ ప్రధాని కావాలనుకుంటున్నారు.. ఏసు క్రీస్తు కూడా దీన్ని అంగీకరించరు: రఘురామకృష్ణరాజు

12-05-2021 Wed 14:22
  • రాష్ట్రంలో కరోనా బాధితులకు తీరని అన్యాయం జరుగుతోంది
  • మృతుల కుటుంబాలకు జగన్ ఆయన జేబులో నుంచి డబ్బులు ఇస్తున్నారా?
  • కరోనా కేసులు పెరిగిపోతుంటే లాక్ డౌన్ ఎందుకు పెట్టడం లేదు?
Jagan wants to become PM says Raghu Rama Krishna Raju

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ఈ దేశ ప్రధాని కావాలనే ఆశ ఉందని ఆయన అన్నారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే పట్టించుకోకుండా... కూడబెట్టిన డబ్బులతో ప్రధాని కావాలనుకుంటున్నారని... ఆయన కోరికను పైనున్న దేవుళ్లు, ఆయన నమ్మిన ఏసు క్రీస్తు కూడా అంగీకరించరని వ్యాఖ్యానించారు. కరోనా బాధితులకు రాష్ట్రంలో తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు.

ఏపీలోని ఆసుపత్రుల్లో కోవిడ్ బాధితులకు తీరని అన్యాయం జరుగుతోందని... ఈ అరాచకాలను పట్టించుకునే వారే లేరని రఘురాజు మండిపడ్డారు. కేవలం జగన్ నిర్లక్ష్యం వల్లే 46 మంది పేషెంట్లు చనిపోయారని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇస్తున్నామంటూ జగన్ చేసిన ప్రకటనపై కూడా ఆయన మండిపడ్డారు. జగన్ ఏమైనా ఆయన జేబులో నుంచి డబ్బులు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని... ఈ కేసులను జగన్ పై పెట్టాలని రఘురాజు అన్నారు. కరోనా లెక్కలపై కూడా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెపుతోందని దుయ్యబట్టారు. కేసులు విపరీతంగా పెరిగిపోతుంటే లాక్ డౌన్ పెట్టకుండా... కర్ఫ్యూ పెట్టడమేంటని ఎద్దేవా చేశారు. ప్రజల ప్రాణాలు, శవాలతో వ్యాపారం చేయడం అత్యంత దారుణమని అన్నారు.