New Delhi: కొవాగ్జిన్ సరఫరా విషయంలో.. ఢిల్లీ సర్కార్​ వర్సెస్​ భారత్​ బయోటెక్​!

  • కొవాగ్జిన్ 1.34 లక్షల డోసులు కావాలన్న ఢిల్లీ
  • అన్ని డోసులు ఇవ్వలేమని చెప్పిన సంస్థ
  • కేంద్ర సర్కార్ ఆదేశానుసారం ఇస్తామని వివరణ  
  • టీకాల్లేక 100 కొవాగ్జిన్ సెంటర్లను మూసేశామన్న సిసోడియా 
  •  కౌంటర్ ఇచ్చిన సంస్థ సహ వ్యవస్థాపకురాలు సుచిత్ర ఎల్లా 
Delhi Government vs Bharat Biotech Over Covaxin Supply

ఢిల్లీ రాష్ట్రానికి మరిన్ని కొవాగ్జిన్ టీకా డోసులను అందించేందుకు భారత్ బయోటెక్ నిరాకరించింది. ప్రస్తుతం తమ వ్యాక్సిన్లకు డిమాండ్ బాగా పెరిగిందని, కానీ, దానికి అనుగుణంగా ఉత్పత్తి చేయలేకపోతున్నామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వివిధ రాష్ట్రాలకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామని తెలిపింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అదనపు డోసులను సరఫరా చేయలేమని పేర్కొంటూ తమ నిస్సహాయతను వెల్లడించింది.

దీనిపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ల సరఫరాలో కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలకు ఇది అద్దం పడుతోందని విమర్శించారు. దేశ అవసరాలు తీరకుండా విదేశాలకు 6.6 కోట్ల డోసులను ఎగుమతి చేయడం చాలా పెద్ద తప్పిదమన్నారు. సరఫరా లేని కారణంగా ఢిల్లీలోని 17 స్కూళ్లలో ఏర్పాటు చేసిన 100 కొవాగ్జిన్ వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసేయాల్సి వస్తోందన్నారు.

1.34 కోట్ల డోసుల కొవాగ్జిన్ ను ఇవ్వాల్సిందిగా కోరామని, కానీ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించే రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామంటూ భారత్ బయోటెక్ స్పష్టంగా వెల్లడించిందని సిసోడియా గుర్తు చేశారు. ఏ రాష్ట్రానికి ఎన్ని డోసులు ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ఆ సంస్థ చెప్పిందన్నారు.

అయితే, సిసోడియా వ్యాఖ్యలకు సంస్థ సహ వ్యవస్థాపకురాలు సుచిత్రా ఎల్లా కౌంటర్ ఇచ్చారు. మొన్న (సోమవారం) 18 రాష్ట్రాలకు కొవాగ్జిన్ డోసులను పంపించామని గుర్తు చేశారు. చిన్న మొత్తంలోనే పంపించినా వివిధ రాష్ట్రాలకు డోసులు పంపించామని, అందులో ఢిల్లీ కూడా ఉందని చెప్పారు. తమ ఉద్దేశాలు, మాటలను కొన్ని రాష్ట్రాలు తప్పుగా అర్థం చేసుకోవడం బాధిస్తోందని సిసోడియా వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. తమ సంస్థలోని 50 మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని, అయినా కూడా లాక్ డౌన్ లోనూ పనిచేస్తూనే ఉన్నామని చెప్పుకొచ్చారు.

More Telugu News