Corona Virus: భార‌త్‌కు అమెరికా అందిస్తోన్న‌ సాయంపై శ్వేత‌సౌధం స్పంద‌న‌

  • అన్ని వేళ‌లా మ‌ద్ద‌తుగా నిలుస్తాం
  • అమెరికాలోని కార్పొరేట్ సంస్థ‌ల నుంచీ సాయం
  • ప్రభుత్వం నుంచి 100 మిలియన్ డాలర్ల సాయం
  • ప్రైవేట్ రంగం నుంచి మ‌రో 400 మిలియన్ డాలర్ల విరాళం
  • 20,000 రెమ్‌డెసివిర్లు ఇంజ‌క్ష‌న్లు, 1,500 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు  
usa helps india says whitehouse

భార‌త్‌లో క‌రోనా విజృంభ‌ణ ఊహించ‌ని స్థాయిలో పెరిగిపోతోన్న నేప‌థ్యంలో ప‌లు దేశాల నుంచి ఇప్ప‌టికే భారీగా సాయం అందిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు దేశాలు సాయం అంద‌జేస్తున్నాయి. అమెరికా కూడా త‌మ వంతు సాయం అంద‌జేస్తోంది.

అంతేగాక‌, అమెరికాలోని ప‌లు దిగ్గ‌జ సంస్థలు భార‌త్‌కు పెద్ద ఎత్తున వైద్య ప‌రిక‌రాలు, ఆక్సిజ‌న్ పంపుతు‌న్నాయి. భారత్ కు అన్ని వేళ‌లా మ‌ద్ద‌తుగా నిలుస్తామ‌ని వైట్‌హౌస్‌‌ మరోసారి తెలిపింది. త‌మ దేశ ప్ర‌భుత్వంతో పాటు అమెరికాలోని కార్పొరేట్ సంస్థ‌లు కూడా పెద్ద ఎత్తున భార‌త్ కు విరాళాలు ఇచ్చాయ‌ని గుర్తు చేసింది.

ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భాగ‌స్వామ్యంలో విరాళాలు అందుతున్నాయ‌ని చెప్పింది. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో భారత్ తో కలిసి అగ్రరాజ్యం పనిచేస్తోందని వైట్‌హౌస్ తెలిపింది. బైడెన్ ప్రభుత్వం నుంచి 100 మిలియన్ డాలర్ల సాయం అందింద‌ని చెప్పింది.

అలాగే, ప్రైవేట్ రంగం నుంచి మ‌రో 400 మిలియన్ డాలర్లు విరాళంగా అందాయ‌ని ప్ర‌క‌టించింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధులతో ఎప్ప‌టిక‌ప్పుడు మాట్లాడుతున్న‌ట్లు తెలిపింది. గ‌త‌ ఆరు రోజుల్లో త‌మ దేశం నుంచి భార‌త్‌కు ఆరు విమానాల ద్వారా 20,000 మోతాదుల‌ రెమ్‌డెసివిర్లు, 1,500 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, 550 మొబైల్‌ ఆక్సిజ‌న్ కాన్సన్‌ట్రేట‌ర్లు, 10 ల‌క్ష‌ల క‌రోనా ర్యాపిడ్ టెస్టు కిట్లు, సుమారు 2.5 మిలియ‌న్ల ఎన్-95 మాస్కులు, పెద్ద మొత్తంలో ప‌ల్స్ ఆక్సీమీట‌ర్లు, ఔష‌ధాలు వంటి పంపామ‌ని చెప్పింది. కాగా, అమెరికాతో పాటు ప‌లు దేశాల నుంచి వాయు, జ‌ల మార్గాల్లో భార‌త్ సాయం అందుకుంటోంది.

More Telugu News