మీ మనసులో మాట చెప్పండి.. కార్యకర్తలకు కమలహాసన్​ సూచన

12-05-2021 Wed 13:11
  • మెయిల్ ద్వారా తెలియజేయాలని విజ్ఞప్తి
  • పరిస్థితులకు తగ్గట్టు సిద్ధాంతాలను మార్చలేమని స్పష్టీకరణ
  • ఎన్నికల్లో వెన్నుపోటుదార్లను ఎదుర్కొన్నామని కామెంట్
  • అసెంబ్లీ పోరులో ఒక్కసీటునూ నెగ్గలేకపోయిన ఎంఎన్ఎం
Mail Me Your Thoughts Kamal Haasan To Party Workers After Resignati

ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమలహాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయింది. కమల్ కూడా తాను పోటీ చేసిన కోయంబత్తూర్ (దక్షిణ) నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో ప్రజాస్వామ్యం లేదని ఆరోపిస్తూ ఆ పార్టీ  ఉపాధ్యక్షుడు ఆర్. మహేంద్రన్ రాజీనామా చేశారు. తనతో పాటు మరో ఆరుగురినీ ఆయన తీసుకెళ్లారు.

ఈ క్రమంలో కమల్ దిద్దుబాటు చర్యలకు దిగారు. మనసులో మాట చెప్పాలంటూ పార్టీ కార్యకర్తలను కోరారు. ఏమనుకుంటున్నారో తనకు మెయిల్ ద్వారా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, వివాదాలు వచ్చాయని, పరిస్థితులు మారాయని పార్టీ సిద్ధాంతాలను, లక్ష్యాలను మార్చలేమని అన్నారు.

తొలిసారి అసెంబ్లీ ఎన్నికలనే పెద్ద యుద్ధంలో బరిలోకి దిగి సమర్థంగా పోరాడామని చెప్పారు. అయితే, ఆ పోరులో వెన్నుపోటుదారులు, శత్రువులు ఎంతో మందిని ఎదుర్కొన్నామన్నారు. ఆ జాబితాలో మహేంద్రన్ ముందుంటారని చెప్పుకొచ్చారు. అతడి అసమర్థతను వేరే వారిపై రుద్దేందుకు చూస్తున్నారన్నారు. ఓటమితో దిగులు చెందొద్దని కార్యకర్తలకు సూచించారు. కాగా, 234 స్థానాలకు గానూ 154 స్థానాల్లో కమలహాసన్ పార్టీ బరిలో నిలిచింది.