Viral Videos: గాజాపై ఇజ్రాయెల్‌ దాడిలో కుప్ప‌కూలిన‌ 13 అంతస్తుల టవర్‌.. వీడియో ఇదిగో

  • గాజా, ఇజ్రాయెల్‌ మధ్య మ‌రోసారి ఉద్రిక్త ప‌రిస్థితులు
  • కుప్ప‌కూలిన ప‌లు భ‌వ‌నాలు
  • సుర‌క్షిత ప్రాంతాల‌కు జ‌నం ప‌రుగులు
Raw Aerial Footage of gaza attck

గాజాలోని హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్‌ మధ్య మ‌రోసారి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పరస్పర రాకెట్ దాడులతో పలు భ‌వ‌నాలు కుప్ప‌కూలిపోయాయి. ఇజ్రాయెల్‌ దాడిలో గాజాలోని 13 అంతస్తుల హందాయి టవర్‌ కుప్పకూలిన దృశ్యాల‌ను ఇజ్రాయెల్ ర‌క్ష‌ణ ద‌ళం త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

దాడి జ‌ర‌గ‌గానే ఆ భ‌వ‌నం నేల కూల‌డాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఈ భవనంలోనే హమాస్‌ ఉగ్రవాద నాయకుల గృహాలతో పాటు కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతంలో దాడులు జ‌రుగుతాయ‌ని ముందుగానే గ్ర‌హించిన స్థానిక అధికారులు దాడికి ముందు ప్రజలను ఖాళీ చేయాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు.

దాడులకు పాల్ప‌డ‌కూడ‌ద‌ని, ఇరు పక్షాలు సంయమనం పాటించాలని ప‌లు దేశాలు కోరుతున్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన 80 యుద్ధ విమానాలు దాడుల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మ‌రోవైపు, గాజాలోని హమాస్ తీవ్ర‌వాదులు ప్రయోగించిన ఓ రాకెట్‌ టెల్‌అవీవ్‌లోని ఓ ఖాళీ బస్సుపై పడింది.

హమాస్ దాడులు ప్రారంభం కాగానే చాలా మంది ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు. హమాస్ తీవ్ర‌వాదులు అనేక రాకెట్లు ప్రయోగించగా, వాటిలో 90 శాతం రాకెట్లను ఇజ్రాయెల్‌కు చెందిన గగనతల రక్షణ‌ వ్యవస్థ ఐరన్‌ డోమ్‌ కుప్పకూల్చింది.

More Telugu News