Israel: ఇజ్రాయెల్​, గాజా మధ్య పరస్పర దాడులు.. 35 మంది బలి, మృతుల్లో కేరళ మహిళ

  • ముందుగా ఇజ్రాయెల్ పై పాలస్తీనా దాడులు
  • 210 క్షిపణులు ప్రయోగించిన హమస్ తీవ్రవాదులు
  • ముగ్గురి మృతి.. పరుగులు పెట్టిన జనం
  • ప్రతీకారంగా రాకెట్ దాడులు చేసిన ఇజ్రాయెల్
Kerala Woman Dies in Israel by Palestine Air Strikes

ఇజ్రాయెల్, గాజా మధ్య పరస్పరం దాడులు చోటుచేసుకున్నాయి. రాకెట్లతో విరుచుకుపడ్డాయి. దీంతో హమాస్ ఉగ్రవాదుల అధీనంలోని గాజాలో 35 మంది పాలస్తీనియన్లు, ఇజ్రాయెల్ లో ముగ్గురు మరణించారు. మంగళవారం రాత్రి గాజా దాడులకు తెగబడగా, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గాజా చేసిన రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్ లో ఉంటున్న కేరళ మహిళ ఒకరు చనిపోయారు.

ముందుగా గాజాలోని హమాస్ తీవ్రవాదులు, ఇతర ఇస్లాం గ్రూపులు ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్, బీర్షెబా నగరాలపై రాకెట్లతో దాడులు చేశాయని, ఫలితంగానే తాము గాజాపై ప్రతిదాడికి దిగాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ అధికార వర్గాలు చెబుతున్నాయి.

హమాస్ తీవ్రవాదులే లక్ష్యంగా దాడులు చేశామని, తీవ్రవాద గ్రూపులోని నిఘా విభాగం నేతలు కొందరు చనిపోయారని ఇజ్రాయెల్ ప్రకటించింది. దాంతో పాటు రాకెట్లను ప్రయోగించే ప్రాంతాలు, హమాస్ కార్యాలయాలపైనా దాడులు చేశామని చెప్పింది. దాదాపు 210 దాకా రాకెట్లను టెల్ అవీవ్, బీర్షెబాపై ప్రయోగించినట్టు హమాస్ ఆయుధ విభాగం ప్రకటించింది.


గాజా రాకెట్లను ప్రయోగించడం వల్ల.. అవి తమ దేశం లో పడకుండా గగన క్షిపణి రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ ప్రయోగించడం వల్ల ఆకాశం ఎర్రబారిపోయింది. గాజా, ఇజ్రాయెల్ లోని కొన్ని భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రజలు దాడుల నుంచి కాపాడుకోవడానికి బేస్ మెంట్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. కాగా, 2014 నుంచి ఇప్పటిదాకా రెండు దేశాల మధ్య జరిగిన భీకర దాడులు ఇవేనని అధికారులు చెబుతున్నారు.

వీడియో కాల్  మాట్లాడుతుండగానే..

ఇజ్రాయెల్ పై గాజా చేసిన రాకెట్ దాడుల్లో సౌమ్య అనే 31 ఏళ్ల కేరళ మహిళ మరణించారు. యాష్కెలాన్ అనే సిటీలో ఆమె నివసిస్తోంది. మంగళవారం సాయంత్రం కేరళలోని తన భర్త సంతోష్ తో వీడియో కాల్ మాట్లాడుతుండగానే.. గాజా ప్రయోగించిన రాకెట్ ఆమె ఇంటిపై పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయారు. వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలోనే తన అన్న పెద్ద పేలుడు శబ్దం విన్నాడని, ఆ వెంటనే ఫోన్ కట్ అయిపోయిందని సంతోష్ తమ్ముడు సాజి చెప్పాడు.


వెంటనే అక్కడే పనిచేస్తున్న మలయాళీలకు ఫోన్ చేసి విషయం కనుక్కుంటే దాడిలో సౌమ్య చనిపోయినట్టు చెప్పారన్నారు. సౌమ్య స్వస్థలం ఇడుక్కి జిల్లాలోని కీరితోడు అని, ఏడేళ్లుగా ఇజ్రాయెల్ లో పనిమనిషిగా చేస్తోందని బంధువులు తెలిపారు.

సౌమ్య మృతి పట్ల కేంద్ర మంత్రి వి. మురళీధరన్ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి అన్ని విధాలా సాయం చేస్తామని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం తరఫున సౌమ్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నానని భారత్ లో ఇజ్రాయెల్ రాయబారి రోన్ మల్కా అన్నారు.

More Telugu News