'పుష్ప' రెండు భాగాలుగా రావడమనేది నిజమేనంటున్న నిర్మాత!

12-05-2021 Wed 11:14
  • బన్నీ నుంచి రానున్న 'పుష్ప'
  • కథానాయికగా రష్మిక
  • ముగింపు దశలో చిత్రీకరణ
  • రెండు భాగాలపై నిర్మాత స్పష్టత 
Pushpa movie will release in two parts

అల్లు అర్జున్ కథానాయకుడిగా 'పుష్ప' సినిమా రూపొందుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తుండగా, ప్రతినాయకుడిగా ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగుకు అంతరాయం ఏర్పడటంతో, దసరాకి విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారనే టాక్ కూడా వచ్చింది.

ఈ సినిమా నిడివి ఎక్కువగా వస్తుందని భావించిన సుకుమార్, రెండు భాగాలు చేసి విడుదల చేద్దామని నిర్మాతలతో చెప్పినట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అందుకు వాళ్లు అంగీకరించినట్టుగా కూడా చెప్పుకున్నారు. కానీ అలా చేస్తారా? అనే సందేహం అభిమానుల్లో ఉంది. కానీ ఇది నిజమేననే విషయాన్ని నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ తాజాగా వెల్లడించారు. సుకుమార్ .. బన్నీ అంతా చర్చించే ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పారు. అయితే ముందుగా లీక్ అయిన విషయం ప్రకారం దసరాకి ఒక భాగం .. వచ్చే వేసవి సెలవుల్లో ఒక భాగం వస్తాయేమో!