google: గూగుల్ పే నుంచి మరో సౌకర్యం.. ఇక‌పై అమెరికా నుంచి భార‌త్‌కు డబ్బు పంపుకోవచ్చు!

  • వెస్ట్ర‌న్ యూనియ‌న్, వైజ్ కంపెనీల‌తో గూగుల్ ఒప్పందం
  • అమెరికా నుంచి సింగ‌పూర్‌కు కూడా పంపొచ్చు
  • వ్య‌క్తిగ‌త యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులోకి సేవ‌లు
money transfer facility from usa to india in  google pay

గూగుల్ పే యాప్‌ వినియోగ‌దారులు ఇక నుంచి అమెరికా నుంచి భార‌త్‌, సింగ‌పూర్‌ యూజ‌ర్ల‌కు డ‌బ్బులు పంపే వెసులుబాటును ఆ సంస్థ క‌ల్పించింది. ఈ మేర‌కు యూజ‌ర్ల‌కు ఈ స‌దుపాయాలు క‌ల్పించేందుకు ఆర్థిక సేవ‌ల సంస్థ‌లు వెస్ట్ర‌న్ యూనియ‌న్, వైజ్ కంపెనీల‌తో ఒప్పందం చేసుకున్న‌ట్లు టెక్‌క్రంచ్ పోర్టల్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. అనంత‌రం గూగుల్ పే కూడా ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించింది.

అంతేగాక‌, ఆర్థిక సేవ‌ల సంస్థ‌లు వెస్ట్ర‌న్ యూనియ‌న్ తో న‌గ‌దు బ‌దిలీ ఒప్పందం కుదుర్చుకున్న నేప‌థ్యంలో ఇక‌పై అమెరికా యూజ‌ర్లు మ‌రో 200 దేశాల‌కు, వైజ్ ద్వారా 80 దేశాల‌కు డ‌బ్బు పంపుకునే సౌక‌ర్యాలు కూడా అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని గూగుల్ పే చెప్పింది.

ఈ స‌దుపాయాలు వ్య‌క్తిగ‌త యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటాయ‌ని, బిజినెస్ లావాదేవీల‌కు ఈ సౌక‌ర్యం ఉండ‌బోద‌ని టెక్ క్రంచ్ వివ‌రించింది. ఇటీవలి కాలంలో న‌గదు బ‌దిలీల కోసం భార‌త్‌లో గూగుల్ పేను కోట్లాది మంది వాడుతున్నారు.

More Telugu News