ఒక్కో డోసుకు రూ. 600.. కారులోనే టీకాలు వేసేస్తున్న విజయవాడ వైద్యుడు

12-05-2021 Wed 10:12
  • సత్యనారాయణపురంలో కారులో టీకాలు వేస్తున్న వైద్యుడు
  • స్థానిక కార్పొరేటర్ నిలదీయడంతో ఉడాయింపు
  • వెంబడించి రామవరప్పాడు రింగ్ సెంటర్‌లో పట్టుకున్న కార్పొరేటర్
  • వ్యాక్సిన్ వేయించుకున్న ముగ్గురు వ్యక్తులు కారులోనే
Doctor administered vaccines in a car in vijayawada

కొవిడ్ టీకాల కొరతను అడ్డగోలుగా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించాడో వైద్యుడు. ఒక్కో డోసుకు ధరను నిర్ణయించి కారులోనే దుకాణం తెరిచేశాడు. విజయవాడలో నిన్న వెలుగుచూసిందీ ఘటన. నగరంలోని సత్యనారాయణపురం  గిరి వీధిలో ఓ వైద్యుడు ఒక్కో డోసుకు రూ. 600 వసూలు చేస్తూ కారులోనే టీకాలు వేస్తున్నాడు. విషయం తన దృష్టికి రావడంతో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తి అక్కడికి చేరుకుని వైద్యుడిని నిలదీయడంతో కారుతో సహా అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.

అప్రమత్తమైన కార్పొరేటర్ బైక్‌పై కారును వెంబడించారు. రామవరప్పాడు రింగ్ సెంటర్‌లో కారును ఆపి వైద్యుడిని పట్టుకున్నారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు కారును తనిఖీ చేశారు. అందులో టీకా వేయించుకున్న ముగ్గురు భీమవరం వ్యక్తులు కనిపించారు. అలాగే కొన్ని సూదులు, ఇంజక్షన్లు లభించాయి. కారులోని వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి వివరాలు సేకరించారు.

జి. కొండూరులో పనిచేసే ఓ వైద్యుడు తమతోపాటు మరికొందరికి టీకాలు వేసినట్టు వారు చెప్పారు. కారులో వ్యాక్సిన్లు కనిపించకపోవడం, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు వారి ముగ్గురితో పాటు వైద్యుడిని కూడా వదిలిపెట్టేశారు.