Hyderabad: పాతబస్తీకి దూరంగా కరోనా.. ఆశ్చర్యపరుస్తున్న పాజిటివిటీ రేటు!

  • పాతబస్తీలో పాజిటివిటీ రేటు 10 శాతం లోపే
  • యాకుత్‌పుర-2, దారుల్‌షిఫా పీహెచ్‌సీల్లో సున్నా పాజిటివిటీ రేటు
  • పలు కారణాలున్నాయంటున్న వైద్యులు
corona virus away from Hyderabad Old City

కరోనా సెకండ్ వేవ్‌తో దేశం అల్లాడిపోతున్న వేళ హైదరాబాద్‌లోని పాతబస్తీలో వైరస్ వ్యాప్తి అంతంత మాత్రంగానే ఉండడం వైద్య నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడి పీహెచ్‌సీలలో పాజిటివ్ రేటు పది శాతం లోపే నమోదవుతుండడం గమనార్హం. అదే సమయంలో హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో ఈ రేటు 40 నుంచి 50 శాతంగా ఉండడం గమనార్హం.

పాతబస్తీ పీహెచ్‌సీలలో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. వారిలో 5 శాతం మంది కూడా పాజిటివ్‌గా తేలడం లేదు. పాతబస్తీలోని 18 ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేస్తున్నారు. దారుల్‌షిపా ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 10న 50 మందికి పరీక్షలు చేస్తే వారిలో ఒక్కరు మాత్రమే పాజిటివ్‌గా తేలారు. వైరస్‌ను కచ్చితంగా పట్టుకోగలిగే ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లోనూ పాజిటివ్ రేటు అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.

ఇక దారుల్‌షిఫా, అజాంపుర, యాకుత్‌పుర ఆరోగ్య కేంద్రాల్లో చేస్తున్న పరీక్షల్లో 99 శాతం మంది నెగటివ్‌గానే బయటపడుతున్నారు. మరీ ముఖ్యంగా యాకుత్‌పుర-2 పీహెచ్‌సీ పరిధిలో పాజిటివ్ రేటు సున్నాగా ఉండడం గమనార్హం. ఈ పీహెచ్‌సీ పరిధిలో ఇప్పటి వరకు 471 మందికి పరీక్షలు చేస్తే ఒక్కరు కూడా కొవిడ్ బారినపడినట్టు నిర్ధారణ కాలేదు.

పాతబస్తీలో వలసలు తక్కువగా ఉండడం, సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన హలీం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఇక్కడ పాజిటివిటీ రేటు తక్కువగా ఉండడానికి బహుశా అదే కారణమై ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే, ఈ ప్రాంతాల్లో డ్రైఫ్రూట్స్ వినియోగం కూడా ఎక్కువని, ఇవి రోగ నిరోధకశక్తిని పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తాయని అంటున్నారు.

దీనికి తోడు ఈ ప్రాంతాల్లో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు చేస్తుండడం, ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చేయించడంతోపాటు క్రిమినాశక మందులు పిచికారీ చేస్తుండడం వంటివి కరోనా నుంచి ఇక్కడి ప్రజలను దూరంగా ఉంచుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News