చంద్రబాబుపై గుంటూరు, నరసరావుపేటల్లో మరో రెండు కేసులు

12-05-2021 Wed 07:43
  • చంద్రబాబుపై కొనసాగుతున్న కేసుల పరంపర
  • రెండు కేసులు న్యాయవాదుల ఫిర్యాదుపైనే
  • నరసరావుపేటలో అచ్చెన్నాయుడిపైనా కేసు
Cases against Chandrababu and Atchannaidu in Guntur and Narasarao pet

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. కరోనాపై లేనిపోని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ  న్యాయవాదులు చేసిన ఫిర్యాదుపై గుంటూరు, నరసరావుపేట పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

కర్నూలు జిల్లాలో ప్రమాదకరమైన ఎన్440కె రకం వేరియంట్ వెలుగుచూసిందని, ఇది సాధారణ వైరస్ కంటే 10-15 రెట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవని, ప్రజల్లో మానసిక వేదన, అధైర్యం కల్పించాయని పేర్కొంటూ, జిల్లా కోర్టు న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో నిన్న కేసు నమోదైంది.

నరసరావుపేటలోనూ చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. ఇది కూడా కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుతోనే కావడం గమనార్హం. చంద్రబాబు, ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు కలిసి కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పట్టణానికి చెందిన న్యాయవాది రాపోలు శ్రీనివాసరావు చేసిన ఫిర్యాదుపై నిన్న నేతలిద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, ఇలాంటి ఆరోపణలతోనే ఇటీవల కర్నూలులో చంద్రబాబుపై కేసు నమోదైంది.