కడప జిల్లా పేలుడు కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి పెదనాన్న అరెస్ట్

11-05-2021 Tue 21:34
  • ఇటీవల కడప జిల్లాలో ముగ్గురాయి గనుల్లో పేలుడు
  • జిలెటిన్ స్టిక్స్ పేలి 10 మంది మృతి
  • ప్రతాపరెడ్డి పేరిట జిలెటిన్ స్టిక్స్ లైసెన్స్
  • ప్రతాపరెడ్డిపై కేసు నమోదు
  • ఇప్పటివరకు ముగ్గురి అరెస్ట్
Police arrests Pratap Reddy in blast case

ఇటీవల కడప జిల్లా మామిళ్లపల్లె వద్ద జిలెటిన్ స్టిక్స్ పేలిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురాయి గనుల్లో పేలుడుకు సంబంధించిన ఈ కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి బంధువు ప్రతాపరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే ముగ్గురాయి గని యజమాని నాగేశ్వర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.

ప్రతాపరెడ్డి ఎంపీ అవినాశ్ కు పెదనాన్న అవుతారు. ప్రతాపరెడ్డికి కడప జిల్లాలో పలు చోట్ల గనులు ఉన్నాయి. ఈ గనుల్లో పేలుళ్లకు ఉపయోగించే జిలెటిన్స్ స్టిక్స్ లైసెన్స్ ఆయనకు ఉంది. ప్రతాపరెడ్డి లైసెన్స్ ద్వారానే జిలెటిన్స్ స్టిక్స్ పులివెందుల నుంచి కలసపాడు తరలించారని, ఆ తరలింపులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ప్రతాపరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.