మహేశ్ నిర్ణయం ఫ్యాన్స్ ను నిరాశ పరచనుందా?

11-05-2021 Tue 19:04
  • సెట్స్ పై 'సర్కారు వారి పాట'
  • ప్రారంభం కానున్న త్రివిక్రమ్ మూవీ
  • ఈ నెల 31వ తేదీన కృష్ణ బర్త్ డే
  • టీజర్ రిలీజ్ పై ఆసక్తిని చూపని మహేశ్  
Sarkaru Vari Pata Teaser Postponed

మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నాడు. రెండవ షెడ్యూల్ షూటింగు జరుగుతూ ఉండగా, కరోనా కారణంగా ఆపేశారు. పరిస్థితులు అనుకూలించిన తరువాత సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా తరువాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసిన త్రివిక్రమ్, ఇతర పనుల్లో ఉన్నాడు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 31వ తేదీపై మహేశ్ అభిమానులంతా దృష్టి పెట్టారు.

ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు .. ఈ సందర్భంగా 'సర్కారువారి పాట' నుంచి టీజర్ రావచ్చుననే టాక్ వినిపించింది. అలాగే త్రివిక్రమ్ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ ను వదిలే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫస్టు లుక్ లు .. టీజర్లు వదలడం కరెక్ట్ కాదనే అభిప్రాయంతో మహేశ్ బాబు ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. పరిస్థితులు సర్దుకున్న తరువాతనే వాటిని రిలీజ్ చేద్దామని అన్నాడని చెప్పుకుంటున్నారు. ఆయన ఆలోచన సరైనదే అయినా, ఇది అభిమానులకు కాస్త నిరాశను కలిగించే విషయమే.