క్రిష్ .. వైష్ణవ్ తేజ్ మూవీ ఇప్పట్లో రానట్టే!

11-05-2021 Tue 18:23
  • క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'కొండపొలం'
  • మేకప్ లేకుండా చేసిన రకుల్
  • 45 రోజులో పూర్తయిన షూటింగ్
  • వచ్చే ఏడాదిలోనే విడుదల    
Vaishnav Tej next movie wil be released in next year

వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఇటీవల వచ్చిన 'ఉప్పెన' సినిమా, రికార్డుస్థాయి వసూళ్లను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద బ్యానర్లు రెడీగా ఉన్నాయి. 'ఉప్పెన' తరువాత వెంటనే ఆయన ఓ మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టేశాడు. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. అయితే 'ఉప్పెన' కంటే ముందుగానే క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ 'కొండపొలం' అనే సినిమాను చేశాడు. అయితే ఈ సినిమా ఇంకా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

గ్రామీణ నేపథ్యంలో రూపొందిన కథ ఇది .. ఈ సినిమాలో రకుల్ మేకప్ లేకుండగా నటించిందని అంటున్నారు. ఈ సినిమా షూటింగును క్రిష్ 45 రోజులలో పూర్తి చేశారు. దాంతో త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ ఏడాదిలో ఈ సినిమా రాదని తెలుస్తోంది. అందుకు కారణం వీఎఫ్ ఎక్స్ అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి వీఎఫ్ ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుందట. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో డిసెంబర్ వరకూ ఈ వర్క్ పూర్తయ్యే అవకాశం లేదట. అందువలన ఈ సినిమా విడుదల వచ్చే ఏడాదిలోనే అంటున్నారు.