Central Vista: సెంట్రల్ విస్టాను అడ్డుకోవడానికి చేస్తున్న మరో ప్రయత్నమే ఇది: ఢిల్లీ హైకోర్టులో కేంద్రం

  • సెంట్రల్ విస్టాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు
  • పిటిషన్ పై అసంతృప్తిని వ్యక్తం చేసిన కేంద్రం
  • పిటిషన్ దారుడికి జరిమానా విధించాలని విన్నపం
This is another attempt to stop Central Vista tells Center to Delhi HC

కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను ఈరోజు ఢిల్లీ హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా ఈ పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రాజెక్టును నిలిపివేసేందుకు వ్యతిరేకులు చేస్తున్న మరో ప్రయత్నమే ఇది అని కోర్టు ముందు కేంద్రం పేర్కొంది. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తొలి నుంచి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయని... ఇది కూడా అందులో భాగమేనని చెప్పింది.

ఈ పిటిషన్ ను కొట్టివేయాలని... పిటిషన్ వేసిన వ్యక్తికి జరిమానా విధించాలని కోర్టును కేంద్రం కోరింది. నిర్మాణ ప్రదేశంలో కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపింది. మరోవైపు రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలంతా ఈ ప్రాజెక్టుపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కరోనాను పట్టించుకోకుండా సెంట్రల్ విస్టాపై దృష్టి సారిస్తున్నారని వారు దుయ్యబడుతున్నారు.

More Telugu News