కార్తి 'సర్దార్' కోసం భారీ సెట్లు!

11-05-2021 Tue 17:13
  • కార్తి తాజా చిత్రంగా 'సర్దార్'
  • జైల్లో ఒక ఖైదీ చుట్టూ తిరిగే కథ
  • కథానాయికగా రాశి ఖన్నా
  • అంచనాలు పెంచుతున్న దర్శకుడు మిత్రన్  
Huge sets for Sardar movie

మొదటి నుంచి కూడా కార్తి వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఈ ప్రయత్నంలో ఆయనకి 'ఖాకి' .. 'ఖైదీ' సినిమాలు విజయాలను తెచ్చిపెట్టగా, ఇటీవల వచ్చిన 'సుల్తాన్' మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినా ఆయన డీలాపడిపోకుండా, 'సర్దార్' సినిమా షూటింగులో ఉత్సాహంతో పాల్గొంటున్నాడు. మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల మోషన్ పోస్టర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలాకాలం నుంచి జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఒక ఖైదీగా ఈ పోస్టర్లో కార్తి కనిపిస్తున్నాడు.

ఈ కథలోని కొన్ని కీలకమైన సన్నివేశాలు జైల్లోనే జరుగుతాయట. అంటే కథలో కీలకమైన మలుపులు జైలును కేంద్రంగా చేసుకుని నడుస్తాయన్న మాట. అందువలన ప్రత్యేకంగా జైలును .. దానికి అనుసంధానం చేయబడిన సెట్లను వేయిస్తున్నారట. ఇందుకుగాను 2 కోట్ల రూపాయాలకు పైగా ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, సాధ్యమైనంతవరకూ సెట్లలోనే షూటింగును కానిచ్చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కార్తి జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. తన కెరియర్ కి ఈ సినిమా చాలా హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది.