నదుల్లో శవాలు తేలుతుంటే... మీ దృష్టి మాత్రం సెంట్రల్ విస్టాపైనే ఉంది: మోదీపై రాహుల్ గాంధీ ఫైర్

11-05-2021 Tue 16:35
  • ఆసుపత్రుల ముందు కిలోమీటర్ల మేర క్యూలు ఉంటున్నాయి
  • ప్రజల ప్రాణాలకు రక్షణే లేకుండా పోయింది
  • మీరు పెట్టుకున్న రంగుల కళ్లద్దాలను తీసేయండి
Rahul Gandhi blames Modi amid Central Vista

నదుల్లో నీటిపై తేలుతున్న మృతదేహాలు, ఆసుపత్రుల వద్ద క్యూలలో నిలబడుతున్న కరోనా పేషెంట్లు మీకు కనపడటం లేదా? అంటూ ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. వీటన్నిటినీ పట్టించుకోకుండా... కేవలం సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపైనే దృష్టి సారించారని దుయ్యబట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవనం, సెంట్రల్ సెక్రటేరియట్, ప్రధాని నివాసం, ఉపరాష్ట్రపతి బంగళా, రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు 3 కిలోమీటర్ల రహదారిని పునరుద్ధరించడం వంటి నిర్మాణాలు ఉన్నాయి.

ట్విట్టర్ ద్వారా రాహుల్ స్పందిస్తూ... నదుల్లో ప్రతి రోజు శవాలు తేలుతున్నాయని, ఆసుపత్రుల ముందు కిలోమీటర్ల మేర క్యూలు ఉంటున్నాయని, ప్రజల ప్రాణాలకు రక్షణే  లేకుండా పోయిందని మోదీపై విమర్శలు గుప్పించారు. మీరు పెట్టుకున్న రంగుల కళ్లద్దాలను తీసేయాలని... అవి పెట్టుకుంటే మీకు సెంట్రల్ విస్టా మాత్రమే కనిపిస్తుందని దుయ్యబట్టారు.

బీహార్ లోని బక్సర్ వద్ద గంగానదిలో నిన్న డజన్ల కొద్దీ శవాలు నీటిపై తేలాయి. అయితే, ఇవి ఉత్తరప్రదేశ్ నుంచి కొట్టుకొచ్చాయని బీహార్ అధికారులు తెలిపారు. అవన్నీ యూపీకి చెందిన కరోనా పేషెంట్ల మృతదేహాలని... వాటిని దహనం చేయడానికి స్థలం కూడా లేకపోవడంతో, గంగానదిలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు సగం కాలిన శవాలు హమీర్ పూర్ వద్ద యమునా నదిలో నీటిపై తేలాయి. ఈ ఘటనల నేపథ్యంలోనే మోదీని రాహుల్ టార్గెట్ చేశారు.