రుయాలో చనిపోయింది 11 మంది కాదు, 30 మంది అని ప్రత్యక్షసాక్షులు అంటున్నారు: లోకేశ్

11-05-2021 Tue 14:19
  • రుయా ఘటనపై లోకేశ్ ఆగ్రహం
  • ఇవి ప్రభుత్వ హత్యలేనని ఆరోపణ
  • రోగుల మృతిపై వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్
  • జగన్ మూర్ఖత్వం వీడాలని హితవు
Nara Lokesh slams AP govt on RUIA incident

తిరుపతి రుయా ఆసుపత్రిలో గత రాత్రి ఆక్సిజన్ సరఫరా లేక కరోనా రోగులు మరణయాతన అనుభవించారు. ఈ ఘటనలో 11 మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో కరోనా రోగులు చనిపోలేదని, దయలేని జగన్ ప్రభుత్వమే చంపేసిందని విమర్శించారు. ఈ ఘటనలో 11 మంది కాదు 30 మంది మరణించారని రుయా ఆసుపత్రి ముందు నిరసన తెలుపుతున్న ఓ ప్రత్యక్షసాక్షి చెబుతున్నారని లోకేశ్ వెల్లడించారు.

"ఐదు నిమిషాలు మాత్రమే ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందనేది అబద్ధం... 11 మందే చనిపోయారనేది అంతకంటే పెద్ద అబద్ధం. అధికారులు వచ్చి మా ముందు మాట్లాడాలి అంటూ బాధితులు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా సర్కారు దొంగ మాటలు, దొంగ లెక్కలు మాని వాస్తవాలు బయటపెట్టాలి" అని లోకేశ్ డిమాండ్ చేశారు.

మీడియాపై ఆంక్షలు, ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులతో వాస్తవాలు దాగవని తెలిపారు. ఆక్సిజన్ కొరతతో రాష్ట్రంలో ఇప్పటికే 76 మందికి పైగా చనిపోయారని, ఇంకెంత మంది ప్రాణాలు బలిగొంటారని ప్రశ్నించారు. జగన్ ఇప్పటికైనా మూర్ఖత్వాన్ని పక్కనబెట్టి మానవత్వంతో ఆలోచించాలని హితవు పలికారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో చనిపోయినవారిని ప్రభుత్వ హత్యలుగా భావించి తక్షణమే వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.