New Delhi: ఇలాగైతే దేశం మొత్తానికి వ్యాక్సిన్​ వేయాలంటే రెండేళ్లు పడుతుంది: ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​

Delhi CM Arvind Kejriwal Asks Center to Give Permission for other companies to manufacture Vaccines
  • కరోనా టీకాల ఉత్పత్తికి వేరే సంస్థలకూ అనుమతులివ్వాలని విజ్ఞప్తి
  • ఇప్పుడున్న సంస్థలు ఫార్ములాను పంచుకునేలా చూడాలని వినతి
  • యుద్ధ ప్రాతిపదికన టీకాల ఉత్పత్తిని పెంచాలని సూచన  
కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి కోసం మరిన్ని సంస్థలకూ అనుమతులను ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ప్రస్తుతమున్న వ్యాక్సిన్ డిమాండ్ ను అందుకోవాలంటే మరిన్ని సంస్థలకు అనుమతులివ్వాల్సిందేనని చెప్పారు. ఢిల్లీలో త్వరలో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేస్తామని, రోజూ 3 లక్షల మందికి వ్యాక్సిన్లు వేస్తామని ఆయన చెప్పారు. అప్పుడు మరిన్ని వ్యాక్సిన్లు అవసరమవుతాయని వివరించారు.

ప్రస్తుతం రోజూ కేవలం 1.25 లక్షల డోసులే వేస్తున్నామన్నారు. రాబోయే మూడు నెలల్లో ఢిల్లీ వాసులందరికీ టీకాలు వేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు తెలిపారు. అయితే, ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత ఉందని, ఇప్పుడున్న నిల్వలు కేవలం కొన్ని రోజులకే సరిపోతాయని అన్నారు.

రెండు కంపెనీలే వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయని, అవి కూడా నెలకు కేవలం ఆరేడు కోట్ల డోసులేనని కేజ్రీవాల్ చెప్పారు. ఉత్పత్తి ఇలాగే ఉంటే దేశం మొత్తానికి వ్యాక్సిన్లు వేయాలంటే రెండేళ్లు పడుతుందన్నారు. అప్పటికే మరిన్ని వేవ్ లు వస్తాయన్నారు. కాబట్టి ఆ వేవ్ ల ముప్పును తప్పించుకోవాలంటే యుద్ధప్రాతిపదికన కరోనా టీకాల ఉత్పత్తిని పెంచాలన్నారు. అందుకు అనుగుణంగా వ్యాక్సినేషన్ పై జాతీయ ప్రణాళికను రూపొందించాలని సూచించారు.

ఆ రెండు సంస్థల ఫార్ములాను వేరే సంస్థలకూ ఇస్తే వ్యాక్సిన్ ను వేగంగా ఉత్పత్తి చేసేందుకు వీలవుతుందన్నారు. అందుకుగానూ ఆ సంస్థలు రాయల్టీ చెల్లించేలా నిబంధన పెట్టాలన్నారు. ఈ నిర్ణయం తీసుకునేందుకు కేంద్రానికి అన్ని అధికారాలూ ఉన్నాయని, ఈ విపత్కర పరిస్థితుల్లో వెంటనే దానిపై నిర్ణయం తీసుకోవాలని కేజ్రీవాల్ కోరారు.
New Delhi
Arvind Kejriwal
COVID19
COVAXIN
Covishield

More Telugu News