కరోనాతో వందల మంది చనిపోతుంటే, వైసీపీ నేత‌లు గుర్ర‌పు స్వారీ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు: వీడియో పోస్ట్ చేసిన లోకేశ్

11-05-2021 Tue 12:57
  • ఆక్సిజన్ లేక ఆసుపత్రుల్లో ప్రజలు చనిపోతున్నారు
  • ఇవేమీ పట్టని వైకాపా ప్రజాప్రతినిధులు గుర్రపు స్వారీని ఆస్వాదిస్తున్నారు
  • నది ఒడ్డున  గడికోట శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు గుర్ర‌పు స్వారీ
  • కడప మేయర్ సురేశ్‌ బాబు కూడా
lokesh slams ycp

క‌రోనాతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ప‌డుతోంటే వైసీపీ నేత‌లు మాత్రం ఎంజాయ్ చేస్తూ గ‌డుపుతున్నార‌ని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ప‌లువురు నేత‌లు గుర్ర‌పుస్వారీ చేస్తున్న వీడియోను ఆయ‌న పోస్ట్ చేశారు.

'బెడ్లు దొరక్క బయట, బెడ్లు దొరికి ఆక్సిజన్ లేక ఆసుపత్రుల్లో ప్రజలు చనిపోతున్నారు. ఇవేమీ పట్టని వైకాపా ప్రజాప్రతినిధులు గుర్రపు స్వారీని ఆస్వాదిస్తున్నారు. కరోనా బారిన పడి వందల మంది చనిపోతుంటే వైకాపా ఎమ్మెల్యేలు మాత్రం సరదాల్లో మునిగి తేలడం దారుణం' అని లోకేశ్ విమ‌ర్శించారు.

'ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందిన తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రి రుయాకి 60 కిలో మీటర్ల దూరంలో నది ఒడ్డున ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేశ్‌ బాబు గుర్రపు స్వారీ చేస్తూ ఎంజాయ్ చేశారు' అని లోకేశ్ తెలిపారు.
 
'ప్రభుత్వానికి, వైకాపా నాయకులకి ప్రజల ప్రాణాలు అంటే ఎంత లెక్కలేనితనమో గుర్రం మీద ఊరేగుతున్న నేతలు ఒక ఉదాహరణ' అని లోకేశ్ అన్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రాజీనామా చేయాల‌ని ఆయ‌న హ్యాష్ ట్యాగ్ జోడించారు.