కరోనా పేషెంట్ భార్యపై ఆసుపత్రి సిబ్బంది వెకిలి చేష్టలు!

11-05-2021 Tue 12:28
  • బీహార్ లోని బాఘల్ పూర్ లో ఘటన
  • ఆవేదనను వీడియోలో బయటపెట్టిన మహిళ
  • రెమ్ డెసివిర్ మందులు సగం వృథా చేశారని ఆరోపణ
  • తన భర్తకు కనీసం మంచినీళ్లు ఇవ్వలేదని ఆవేదన
  • విచారణ జరిపి ఉద్యోగిని సస్పెండ్ చేసిన అధికారులు
No Water For Husband My Dupatta Yanked Corona patient wife ordeal in Bihar Hospital

కరోనా పేషెంట్లకు అండగా ఉండాల్సిన సమయంలో.. పేషెంట్ కు సాయం చేయకపోగా, అతడి భార్యపై నీచానికి పాల్పడ్డాడో ఆసుపత్రి సిబ్బంది. దాహం వేస్తోందన్న భర్తకు.. నీళ్లివ్వాల్సిందిగా పక్కనే ఉన్న మరో పేషెంట్ తాలూకు బంధువును కోరుతుండగా, వెనుక నుంచి వచ్చిన సిబ్బంది ఒకరు, ఆమె చున్నీ పట్టుకుని లాగాడు. నడుముపై చెయ్యి వేసి వికృత చేష్టలకు పాల్పడ్డాడు.

భర్త, తల్లి అదే ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటుండడంతో ఆమె ఆ కీచకుడిని అప్పుడు ఏమీ అనలేకపోయింది. ఆ బాధనంతా ఓ వీడియో రూపంలో వెల్లడించింది. ఈ ఘటన బీహార్ లోని భాగల్ పూర్ లోని గ్లోకల్ ఆసుపత్రిలో జరిగింది. తన భర్తకు ఇస్తున్న రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లలో సగం వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అంత ఖర్చు పెట్టి తెచ్చిన మందులను ఎలా వృథా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘‘మేము నోయిడాలో ఉంటాం. కుటుంబ సభ్యులతో కలిసి హోలీ పండుగ చేసుకునేందుకు బీహార్ కు వెళ్లాం. ఏప్రిల్ 9న నా భర్తకు బాగా జ్వరం వచ్చింది. రెండు సార్లు కరోనా టెస్ట్ చేయించగా నెగెటివ్ వచ్చింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ కోసం వేచి చూస్తుండగా.. ఓసారి సీటీ స్కాన్ చేయించాల్సిందిగా నోయిడా డాక్టర్ చెప్పారు. ఆయన చెప్పినట్టే స్కాన్ చేయించగా.. ఊపిరితిత్తుల్లో 60 శాతం వరకు ఇన్ ఫెక్షన్ వచ్చినట్టు చెప్పారు. ఆ వెంటనే నా భర్త, నా తల్లిని భాగల్ పూర్ లోని ఆసుపత్రిలో చేర్పించాం’’ అని ఆమె వివరించారు.

తన తల్లికి సీరియస్ గా ఉండడంతో ఐసీయూలో చికిత్స చేస్తున్నారని, అక్కడ అంతా బాగానే ఉందని చెప్పింది. అయితే, వేరే వార్డులో ఉన్న తన భర్త పరిస్థితి క్షీణించిందని, అక్కడకు తనను కనీసం పోనివ్వలేదని పేర్కొంది. మాట్లాడలేని పరిస్థితిలో తన భర్త ఉన్నాడని, మంచి నీళ్లు కావాలని సైగలు చేస్తే పక్కనే ఉన్న మరో పేషెంట్ దగ్గర ఉన్న బంధువుకు చెప్పానని అన్నారు. అలా చెబుతుండగానే వెనుక నుంచి ఎవరో తన చున్నీ లాగారని, తిరిగి చూస్తే ఆసుపత్రి సిబ్బంది ఒకరు పళ్లు ఇకిలిస్తూ కనిపించాడని, నడుముపై చెయ్యి వేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ సమయంలో ఏం చేయాలో తనకు అర్థం కాలేదని, తన భర్త, తల్లికి చికిత్స జరుగుతుండడంతో మధ్యలో ఆపేస్తారేమోనన్న భయంతో ఏమీ అనలేకపోయానని ఆమె చెప్పుకొచ్చింది. ఆమె వీడియో వైరల్ కావడంతో అధికారులు ఆసుపత్రిలో విచారణ జరిపారు. లైంగిక వేధింపులకు పాల్పడిన ఉద్యోగిని సస్పెండ్ చేశారు. ఇంకా చాలా ఆసుపత్రుల్లో తన భర్తను కనీసం చేర్చుకోలేదని, మాయాగంజ్, పాట్నాలోని ఆసుపత్రుల్లో చేర్చుకున్నా డాక్టర్లు, సిబ్బంది పట్టించుకోలేదని బాధిత మహిళ ఆరోపించారు.