Sudheer Babu: 'శ్రీదేవి సోడా సెంటర్' నుంచి గ్లింప్స్ రిలీజ్

  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
  • పల్లెటూరి మొనగాడిగా హీరో
  • 'పలాస' దర్శకుడి మరో ప్రయోగం  
  • మణిశర్మ సంగీతం ప్రత్యేక ఆకర్షణ  
Sri Devi Soda Center Glimpse Released

మొదటి నుంచి కూడా సుధీర్ బాబు విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, మంచి ప్రయత్నం చేశాడనో .. మంచి ప్రయోగం చేశాడనో అనిపించుకుంటున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'శ్రీదేవి సోడా సెంటర్' రూపొందుతోంది.

గతంలో 'పలాస 1978' సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన కరుణ కుమార్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు. ఈ రోజున సుధీర్ బాబు పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి టీజర్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

ఈ గ్లింప్స్ ద్వారా ఈ సినిమాలో సుధీర్ బాబు పోషించిన 'సూరిబాబు' పాత్రను పరిచయం చేశారు. ఈ కథ అంతా కూడా గ్రామీణ వాతావరణంలో నడుస్తుందనే విషయం ఈ గ్లింప్స్ వలన అర్థమవుతోంది. ఓ గ్రామంలో 'జాతర' జరిగే ప్రదేశంలో సోడా సెంటర్ నడుపుకునే యువకుడిగా ఈ సినిమాలో సుధీర్ బాబు కనిపిస్తున్నాడు.

ఇక ఆ విలేజ్ లో అతనే మొనగాడు అనే విషయం ఆయన సిక్స్ ప్యాక్ చూస్తేనే స్పష్టమవుతుంది. గోదావరిలో పడవ పందాలతో మొదలయ్యే ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

More Telugu News