Jagan: 11 మంది కరోనా పేషెంట్లు చనిపోవడంపై జగన్ దిగ్భ్రాంతి!

  • తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో విషాదం
  • ఆక్సిజన్ అందక 11 మంది రోగుల మృతి
  • పూర్తి స్థాయి నివేదిక కావాలని ఆదేశించిన జగన్
Jagan responds on Ruia Hospital incident

కరోనా గడ్డుకాలంలో మెడికల్ ఆక్సిజన్ కొరత ఎంతో మంది పేషెంట్ల చావుకు కారణమవుతోంది. ఆక్సిజన్ అందక ప్రతి రోజు దేశ వ్యాప్తంగా ఎంతో మంది కరోనా బాధితులు మృతి చెందుతున్నారు. అలాంటి విషాదకర ఘటన మరొకటి తిరుపతి రుయా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో... ఆక్సిజన్ సపోర్ట్ పై ఉంటూ చికిత్స పొందుతున్న 11 మంది పేషెంట్లు ప్రాణాలు వదిలారు. ఈ ఘటన ఏపీలో కలకలం రేపుతోంది. ఈ విషాదకర ఘటన పట్ల ప్రతి ఒక్కరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎంఓ కార్యాలయ అధికారుల ద్వారా వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ అందించిన వివరాలను ముఖ్యమంత్రికి సీఎంఓ అధికారులు వివరించారు. తనకు పూర్తి స్థాయి నివేదిక కావాలని ఈ సందర్భంగా జగన్ ఆదేశించారు. ఘటనకు దారి తీసిన కారణాలను గుర్తించాలని... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే అన్ని చర్యలను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. కేవలం ఆక్సిజన్ సేకరణపైనే కాకుండా, ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థలపై కూడా దృష్టి సారించాలని అన్నారు.

More Telugu News