ఐసీయూలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ నటుడు మన్సూర్ అలీ ఖాన్

11-05-2021 Tue 10:17
  • కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నట్టు సమాచారం
  • బయటకు వెల్లడికాని వివరాలు
  • చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స 
Actor Mansoor Ali Khan on ICU bed

దక్షిణాదికి చెందిన ప్రముఖ సినీ నటుడు మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర అనారోగ్యానికి గురై ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఏ కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరాడనే వివరాలు బయటకు వెల్లడికానప్పటికీ... కిడ్నీలో రాళ్ల సమస్యతో ఆయన బాధపడుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెపుతున్నాయి. అయితే, ఇతర అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయా? అనే విషయం తెలియరాలేదు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు.

మన్సూర్ అలీ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. వివిధ సినిమాలలో విలన్ పాత్రలతో ఆయన పేరు తెచ్చుకున్నారు. రాజకీయరంగ ప్రవేశం కూడా చేశారు. ఇటీవల తమిళ కమెడియన్ వివేక్ చనిపోయినప్పుడు కూడా మన్సూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ కారణంగానే వివేక్ చనిపోయాడని ఆయన ఆరోపించారు. షుగర్, బ్లడ్ టెస్టుల వంటివి చేయకుండా నేరుగా వ్యాక్సిన్ ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు.

 మాస్క్ ధరించడం వల్ల మనం వదులుతున్న కార్బన్ డయాక్సైడ్ ను మనమే పీలుస్తున్నామని... అలాంటప్పుడు మాస్క్ ధరించడం సురక్షితమని ఎలా చెపుతారని మండిపడ్డారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద మందులను వాడకుండా... ఇంగ్లీష్ మందులను ప్రభుత్వం ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు.