అమెరికాలో 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేయ‌డానికి అనుమతి

11-05-2021 Tue 10:00
  • పిల్లలకు ఫైజర్-బయోఎన్‌టెక్ కరోనా వ్యాక్సిన్
  • అత్యవసర వినియోగానికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోద ముద్ర
  • ఇప్ప‌టికే ప్ర‌యోగాలు విజ‌య‌వంతం
vaccine for children in usa

అమెరికాలో క‌రోనా విజృంభిస్తోన్న నేప‌థ్యంలో వ్యాక్సిన్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని శ‌ర‌వేగంగా పూర్తి చేస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, పిల్ల‌ల‌కు కూడా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని అమెరికా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అమెరికాలోని 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు ఫైజర్-బయోఎన్‌టెక్ కరోనా వ్యాక్సిన్ ను ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. దాని అత్యవసర వినియోగానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ)  ఆమోద ముద్ర వేసింది.

దీంతో  12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వ‌డానికి మార్గం సుగ‌మ‌మైంది. ఇప్ప‌టికే ఈ వ‌య‌సు ఉన్న పిల్ల‌ల‌పై చేప‌ట్టిన వ్యాక్సినేష‌న్ ప్ర‌యోగాలు విజ‌య‌వంత‌మ‌య్యాయి. వారిపై ఆ వ్యాక్సిన్ సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేసినట్లు ఎఫ్‌డీఏ తెలిపింది. పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ వేయ‌డానికి నిర్ణ‌యం తీసుకుని త‌మ దేశం కీలక ముందడుగు వేసింద‌ని ఎఫ్‌డీఏ తాత్కాలిక కమిషనర్ జానెట్ వుడ్‌కాక్ వ్యాఖ్యానించారు.