ఇక్కడెవరూ పట్టించుకోవడం లేదు.. బతికేలా లేను అంటూనే కన్నుమూసిన ఓయూ విద్యార్థి నేత

11-05-2021 Tue 08:05
  • పది రోజులుగా నిమ్స్‌లో చికిత్స
  • ఆక్సిజన్ పెట్టకపోవడంతో ఊపిరి అందడం లేదని ఆవేదన
  • వెంటిలేటర్‌పైనే చికిత్స అందించామన్న ఆసుపత్రి వర్గాలు
OU student leader died in NIMS Hospital

కరోనా మహమ్మారి బారినపడి పది రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఓయూ విద్యార్థి నేత బెల్లంకొండ కృష్ణగౌడ్ నిన్న ఉదయం మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని నేలమర్రికి చెందిన కృష్ణ.. ఆదివారం రాత్రి భార్యకు ఫోన్ చేసి చెప్పిన మాటలు అందరితో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

ఆసుపత్రిలో ఎవరూ తనను పట్టించుకోవడం లేదని, ఆక్సిజన్ పైపు కూడా పెట్టలేదని భార్యతో వాపోయాడు. ఇప్పటికైతే బతికే ఉన్నాను కానీ తర్వాతి సంగతి చెప్పలేనని, తనను త్వరగా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరాడు. ఆక్సిజన్ పెట్టకపోవడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పాడని కృష్ణ భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే, ఆసుపత్రి వర్గాలు మాత్రం మరో రకంగా చెబుతున్నాయి. కృష్ణకు వెంటిలేటర్‌పై చికిత్స అందించామని, పరిస్థితి విషమించడంతోనే మృతి చెందాడని పేర్కొన్నాయి.