మరోసారి తెరపై కనిపించనున్న శివగామి, బాహుబలి?

10-05-2021 Mon 22:14
  • కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ 'సలార్' 
  • పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న చిత్రం
  • ప్రభాస్ అక్కగా రమ్యకృష్ణ నటిస్తున్నట్లు సమాచారం
  • నిర్మాతగా విజయ్‌ కిరగండూర్‌
Prabhas ramyakrishna in another film

రాజమాత శివగామి దేవీ, యువరాజా అమరేంద్ర బాహుబలి మరోసారి తెరపై కనిపించనున్నారు. అదేంటీ బాహుబలికి మరో సీక్వెల్ వస్తోందా? అని ఆలోచిస్తున్నారా? అదేం లేదు. వీరిరువురు కలిసి మరో కొత్త చిత్రంలో నటించనున్నారని సమాచారం.

కేజీఎఫ్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని అందించిన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో డార్లింగ్‌ ప్రభాస్‌ ‘సలార్‌’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ చాలా డిఫరెంట్‌గా కనిపించనున్నారని సమాచారం. తక్కువ డైలాగ్‌లు, ఎక్కువ యాక్షన్‌తో అభిమానులను కనువిందు చేయనున్నారని చిత్ర వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక, ఈ చిత్రంలో ప్రభాస్‌ అక్కగా రమ్యకృష్ణను తీసుకున్నట్లు తెలుస్తోంది.

హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగండూర్‌ సలార్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భువన్‌ గౌడ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. రవి బస్రూర్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. బాహుబలి తర్వాత ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘శైలజారెడ్డి అల్లుడు’లో నటించిన రమ్యకృష్ణ తాజాగా లైగర్‌, రిపబ్లిక్‌ చిత్రాల్లో నటిస్తున్నారు.