Bamboo Bat: కొత్త రకం క్రికెట్ బ్యాట్ ను అభివృద్ధి చేస్తున్న కేంబ్రిడ్జి పరిశోధకులు

Cambridge University researchers works on Bamboo cricket bat
  • ఇప్పటివరకు విల్లో చెక్కతో క్రికెట్ బ్యాట్ల తయారీ
  • వెదురుతో బ్యాట్ తయారుచేసిన కేంబ్రిడ్జి పరిశోధకులు
  • బంతి ఎక్కడ తగిలినా దూసుకెళుతుందని వెల్లడి
  • బరువు అధికం అంటున్న పరిశోధకులు
  • తగ్గించేందుకు శ్రమిస్తున్నామని వెల్లడి
సాధారణంగా క్రికెట్ బ్యాట్లను విల్లో కలపతో తయారుచేస్తారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. 1.ఇంగ్లీష్ విల్లో 2. కశ్మీర్ విల్లో. వీటిలో దేని ప్రత్యేకత దానిదే. అయితే, అందుకు భిన్నంగా వెదురు నుంచి క్రికెట్ బ్యాట్ తయారుచేసేందుకు ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు కృషి చేస్తున్నారు. విల్లోతో బ్యాట్ తయారీలో కలప వృథా అవడం ఎక్కువని, అదే వెదురుతో తయారుచేస్తే కొద్దిపాటి వృథానే ఉంటుందని కేంబ్రిడ్జి వర్సిటీకి చెందిన డాక్టర్ దర్శిల్ షా వెల్లడించారు. ఆయన గతంలో థాయ్ లాండ్ అండర్-17 నేషనల్ క్రికెట్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించారు.

కొత్తరకం బ్యాట్ గురించి వివరిస్తూ... విల్లో చెక్కతో బ్యాట్ చేయాలంటే ఎంతో ప్రయాసతో కూడుకున్నదని తెలిపారు. బ్యాట్ తయారీకి ఉపయోగించే విల్లో చెట్లు 15 ఏళ్ల వయసున్నది అయ్యుండాలని, అదే వెదురు చెట్టు అయితే ఏడేళ్ల వయసుకే ఏపుగా పెరుగుతుందని తెలిపారు. వెదురు చెక్కను పొరలు పొరలుగా అతికించి బ్యాట్ ను సిద్ధం చేస్తామని, ఇది విల్లో బ్యాట్ కు ఏమాత్రం తీసిపోదని చెప్పారు.

పైగా, ఈ వెదురు బ్యాట్ కు 'స్వీట్ స్పాట్' (బంతి బ్యాట్ పై ఎక్కడ తగిలితే అత్యధిక దూరం వెళుతుందో దాన్ని 'స్వీట్ స్పాట్' అంటారు) పరిధి చాలా ఎక్కువని, బ్యాట్ లో ఎక్కడ బంతి తగిలినా దూసుకెళుతుందని వివరించారు. అయితే, ఈ కొత్తరకం బ్యాటు బరువే సమస్యగా మారిందని, ప్రస్తుతం తమ బృందం దానిపైనే పరిశోధనలు సాగిస్తోందని డాక్టర్ దర్శిల్ షా పేర్కొన్నారు. వెదురు బ్యాట్ ను అన్ని విధాలా పరీక్షించి క్రికెట్ అధికారుల పరిశీలనకు అప్పగిస్తామని తెలిపారు.
Bamboo Bat
Cricket
Cambridge University
Dr Darshil Shah
Willow Bat

More Telugu News