బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ చెల్లెళ్లకు కరోనా పాజిటివ్

10-05-2021 Mon 20:55
  • కరోనా బారినపడిన అల్విరా, అర్పిత
  • ఓ మీడియా సంస్థకు వెల్లడించిన సల్మాన్ ఖాన్
  • సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉందని వెల్లడి
  • కొవిడ్ ను తేలిగ్గా తీసుకోవద్దని ఫ్యాన్స్ కు హెచ్చరిక
Salman Khan said his sisters Alvira and Arpitha tested corona positive

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. సల్మాన్ చెల్లెళ్లు అల్విరా ఖాన్ అగ్నిహోత్రి, అర్పితా ఖాన్ శర్మలకు కరోనా పాజిటివ్ వచ్చింది. తన చెల్లెళ్లకు కరోనా నిర్ధారణ అయిన విషయాన్ని సల్మాన్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు. సెకండ్ వేవ్ పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని, కొవిడ్ ను  తేలిగ్గా తీసుకోవద్దని అభిమానులను హెచ్చరించారు.

"నా చెల్లెళ్లు అల్విరా, అర్పితలకు కరోనా సోకింది. దేశంలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ ఎంతో ప్రమాదకరంగా ఉంది. గతంలో... అక్కడ కరోనా కేసులు వచ్చాయి, ఇక్కడ కరోనా కేసులు వచ్చాయి అని విన్నాం... కానీ సెకండ్ వేవ్ లో మన కుటుంబంలోనూ కరోనా కేసులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. కిందటిసారి మా ఇంట్లో డ్రైవర్లకు కరోనా సోకింది. ఈసారి చాలామందికి వ్యాపించింది" అని వివరించారు.

ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో సాయం చేయండంటూ ప్రతిరోజూ అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయని, సినీ రంగంలో ఉన్న పాతికవేల మంది కార్మికులకు ఆహారం, ఔషధాలు అందిస్తున్నామని సల్మాన్ ఖాన్ వెల్లడించారు.